నవతెలంగాణ-హైదరాబాద్ : రెండ్రోజుల క్రితం కూకట్ పల్లిలో హత్యకు గురైన మహిళ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో రేణు అగర్వాల్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు హర్ష, రోషన్ ను పోలీసులు జార్ఖండ్ లోని రాంచీలో అరెస్ట్ చేసి.. ఇద్దరినీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ (50) దంపతులకు ఫతేనగర్లో స్టీల్ సామాన్ల కొట్టు ఉంది. వారి కూతురు తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటుండగా.. కొడుకు శుభంతో కూకట్ పల్లిలోనే నివాసం ఉంటున్నారు. స్వాన్ లేక్ లోనే రేణు చుట్టాల ఇంటిలో రోషన్ 9 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. అతనే జార్ఖండ్ లో తమ గ్రామానికి చెందిన హర్షను కొద్దిరోజుల క్రితం రేణు ఇంటిలో వంటమనిషిగా పెట్టించాడు.
బుధవారం (సెప్టెంబర్ 10) ఉదయం రాకేష్, శుభం తమ కొట్టుకు వెళ్లగా.. రేణు అగర్వాల్ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రాకేష్ ఫోన్ చేసినా తీయకపోవడంతో 7 గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. తలుపు ఎంతసేపటికీ తీయకపోవడంతో ప్లంబర్ ను పిలిపించి బ్యాక్ డోర్ ఓపెన్ చేయించారు. ఇంటి లోపలికి వెళ్లి చూడగా.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి.. రక్తపు మడుగులో పడి ఉంది. శరీరంపై తీవ్రగాయాలుండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో రేణును హర్ష, రోషన్ లు చంపినట్లు నిర్థారించారు. ఆమెను తాళ్లతో కట్టేసి డబ్బు, నగల కోసం చిత్రహింసలు చేసినట్లుగా గుర్తించారు. ఆపై కూరగాయల కత్తులతో గొంతుగోసి, కుక్కర్ తో తలపై బలంగా కొట్టడంతో రేణు మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఇంట్లోని లాకర్లలో ఉన్న డబ్బు, నగలను సూట్ కేసులో పెట్టుకుని, అక్కడే స్నానం చేసి, ఆ ఇంటికి తాళం వేసి వారి స్కూటీపైనే పరారయ్యారు. సీసీటీవీల ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారి జాడ తెలిస్తే చెప్పాలని ఫొటోలను రివీల్ చేశారు.
హత్యానంతరం నిందితులు క్యాబ్ లో విశాఖ మీదుగా రాంచీకి పరారయ్యారు. వారిని ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్.. ఇన్ స్టాలో ఫొటోలను చూసి గుర్తించాడు. వెంటనే పోలీసులకు నిందితుల ఆచూకీ గురించిన సమాచారమివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుల్ని రాంచీలో అరెస్ట్ చేశారు.