Sunday, May 4, 2025
Homeఅంతర్జాతీయంఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం

ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం

- Advertisement -

– రెండోసారి ప్రధాని పదవి చేపట్టనున్న అల్బనీస్‌
కాన్‌బెర్రా:
ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌కి చెందిన పాలక మధ్యే వామపక్ష లేబర్‌ పార్టీ శనివారం విజయం సాధించింది. దీంతో ప్రధాని ఆంథోని అల్బనీస్‌ వరుసగా రెండోసారి ప్రధాని పదవి చేపట్టనున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో సిడ్నీలో మద్దతుదారులను ఉద్దేశించి అల్బనీస్‌ విజయోత్సవ ప్రసంగం చేశారు. ఆస్ట్రేలియన్లు మెజారిటీ లేబర్‌ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితులు నెలకొన్న వేళ.. ఆస్ట్రేలియన్లు ఆశావాదంతో ప్రవర్తించారని అన్నారు. మరోపక్క ప్రతిపక్ష నేత పీటర్‌ డట్టన్‌ తన ఓటమిని అంగీకరించారు. ఈ ఎన్నికల ప్రచారంలో తమ పార్టీ తగిన రీతిలో పని చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇందుకు తాను పూర్తి బాధ్యత స్వీకరిస్తున్నానన్నారు. ప్రధాని అల్బనీస్‌కు అభినందనలు తెలియచేశారు.
అంతకుముందు 150సీట్లు కలిగిన ప్రతినిధుల సభలో పాలక సెంటర్‌ లెఫ్ట్‌ లేబర్‌ పార్టీకి 82సీట్లు వస్తాయని ఆస్ట్రేలియా ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది. ఇప్పటివరకు 85.5శాతం ఓట్లు లెక్కింపు పూర్తయింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ సంకీర్ణానికి 37సీట్లు వస్తాయని పేర్కొంది. అలాగే మైనర్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులకు కలిపి 13సీట్లు గెలుచుకునే అవకాశం వున్నట్లు కనిపిస్తోందని కమిషన్‌ పేర్కొంది. లేబర్‌ పార్టీ 76సీట్లు గెలుస్తుందని, ప్రతిపక్ష సంకీర్ణం 36సీట్లు గెలుపొందుతుందని మైనర్‌ పార్టీలు, స్వతంత్రులు కలిసి 13సీట్లను గెలుచుకుంటారని, తదుపరి పార్లమెంట్‌లో లేబర్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎన్నికల విశ్లేషకుడు ఆంథోనీ గ్రీన్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో పార్టీలకు మెజారిటీ అవసరం. గత ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఎన్నికలు ముగిసిన 17రోజుల తర్వాత కీలకమైన స్వతంత్ర ఎంపీలు లేబర్‌ పార్టీకి మద్దతునిస్తామని ప్రకటించారు.
అల్బనీస్‌కు ప్రధాని మోడీ అభినందనలు
వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా ప్రధానిగా ఎన్నికైన ఆంథోనీ అల్బనీస్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియచేశారు. అల్బనీస్‌ నేతృత్వంలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకు తీసుకెళ్లగలమని భావిస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్‌, అమెరికా సహా పలు దేశాలకు చెందిన నేతలు అభినందనలు తెలియచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -