Friday, May 9, 2025
Homeజాతీయంలాహోర్‌ రక్షణ వ్యవస్థ నిర్వీర్యం

లాహోర్‌ రక్షణ వ్యవస్థ నిర్వీర్యం

- Advertisement -

– ప్రకటించిన సైన్యం
– సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు,క్షిపణులతో పాక్‌ దాడులు
– తిప్పికొట్టిన భారత దళాలు
– ఆపరేషన్‌ సిందూర్‌లో
– వంద మంది ఉగ్రవాదులు హతం : రాజ్‌నాథ్‌
న్యూఢిల్లీ:
ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన మరునాడే భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని పలు ప్రాంతాలలో గగనతల రక్షణ రాడార్లను, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. లాహోర్‌లోని గగనతల రక్షణ వ్యవస్థను గురువారం నిర్వీర్యం చేశాయి. ఆదంపూర్‌, భటిండా, చండీఘర్‌ సహా ఇతర ప్రాంతాలలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపేందుకు పాకిస్తాన్‌ చేసిన ప్రయత్నాలను భారత్‌ తిప్పికొట్టింది. పాకిస్తాన్‌ ఏ స్థాయిలో, ఏ హక్కుతో స్పందిస్తోందో తాము కూడా అదే స్థాయిలో, అదే హక్కుతో స్పందిస్తున్నామని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. లాహోర్‌లోని గగనతల రక్షణ వ్యవస్థను పని చేయకుండా చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం అందిందని చెప్పింది. అవంతిపురా, శ్రీనగర్‌, జమ్ము, పఠాన్‌కోట్‌, అమృతసర్‌, కపూర్తల, జలంధర్‌, లూథియానా, ఆదంపూర్‌, భటిండా, చండీఘర్‌, నాల్‌, ఫాలోడీ, ఉత్తర్‌లై, భుజ్‌ సహా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలలోని సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడానికి పాక్‌ ప్రయత్నించిందని వివరించింది. అయితే వాటిని ఇంటిగ్రేటెడ్‌ కౌంటర్‌ యూఎఎస్‌ గ్రిడ్‌, గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయని తెలిపింది. పాకిస్తాన్‌ దాడులకు రుజువుగా అనేక ప్రాంతాల నుండి శకలాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ మంత్రి సయేద్‌ అబ్బాస్‌ అరాగ్చీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమావేశం అనంతరం జైశంకర్‌ విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతాలలో ఉద్రిక్తత ఎక్కువగా ఉన్నదని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేయాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. అయితే భారత్‌పై సైనిక దాడి జరిగితే మాత్రం గట్టిగా బదులిస్తామని స్పష్టం చేశారు.
అఖిలపక్ష సమావేశం
రాజధాని ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట జరిపిన దాడిలో కనీసం వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎస్‌.జైశంకర్‌ హాజరై నేతలకు పరిస్థితిని వివరించారు. ఈ సంక్షోభ సమయంలో తామంతా ప్రభుత్వానికి అండగా ఉంటామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించామని, అయితే కొన్ని విషయాలపై చర్చించాలని తాము భావించడం లేదని ప్రభుత్వం తెలిపిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రజలకు మంచి సందేశం ఇచ్చేందుకు పార్లమెంట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యం లో సన్నద్ధతలపై, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -