– పడకేసిన ఐటీడీఏ ‘డ్రై మిక్స్ న్యూట్రిమిక్స్’ తయారీ కేంద్రం
– అర్ధాంతరంగా నిలిచిన పౌష్టికాహార పంపిణీ
– తుప్పుపడుతున్న విలువైన పరికరాలు
– కుంటుపడిన గిరిజన మహిళల స్వయంకృషి
– చోద్యం చూస్తున్న ఐటీడీఏ పీఓ?
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
మారుమూల పల్లెలోని గిరిజన చిన్నారులకు పౌష్టికాహార పంపిణీ పేరుతో ఏర్పాటు చేసిన డ్రైమిక్స్ న్యూట్రిమిక్స్ తయారీ కేంద్రం అర్ధాంతరంగా పడకేసింది. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన పరికరాలు ప్రస్తుతం తుప్పుపట్టే దశకు చేరుకున్నాయి. మూతబడి సంవత్సరం కావస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇదీ ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పరిస్థితి.
ఐటీడీఏ పరిధి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్, అంగన్‌వాడీ కేంద్రాల్లో గిరిజన విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా డ్రై మిక్స్ న్యూట్రిమిక్స్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పారు. దీనికి ట్రైకార్, ఐటీడీఏ ద్వారా పూర్తి సబ్సిడీతో రూ.23.88 లక్షలు కేటాయించారు. ఈసీఐఎల్ కూడా మరో రూ.10లక్షలు ఈ యూనిట్‌కు కేటాయించింది. కావాల్సిన పనిముట్లు మిషన్లను కొనుగోలు చేయడానికి ప్రపంచస్థాయిలో పేరుగాంచిన ఇంక్రిశాట్ సంస్థకు అప్పగించారు. పరిశ్రమను కొనసాగించడానికి సుమారు 12 మందితో కూడిన గిరిజన మహిళలను ఎంపిక చేసి స్వయంకృషి పేరుతో జాయింట్ లయబులిటీ గ్రూపుగా వారికి పేరు పెట్టారు. అప్పటి ఐటీడీఏ పీఓగా ఉన్న హనుమంతు కే జెండగే ఆధ్వర్యంలో 2020 డిసెంబర్ 29న ఈ యూనిట్‌ను ప్రారంభించారు. అయితే ఈ గ్రూప్ మహిళలు డ్రైమిక్స్, న్యూట్రిమిక్స్ పౌష్టికాహార పదార్థాలను తయారు చేయాల్సి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా జోహార్ మీల్, మల్టీ గ్రీన్ మీల్, స్వీట్ మీల్‌ను తయారుచేసి ఈ గ్రూప్ మహిళలు పంపిణీ చేయాలి. వీటి తయారీకి ఇంక్రిశాట్ సంస్థ మూడు నెలలపాటు శిక్షణ ఇచ్చి మెళకువలు నేర్పింది.
2021 మే 1న పౌష్టికాహార ఉత్పత్తులు లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ గ్రూపు మహిళలు పదార్థాల తయారీకి కావలసిన రా మెటీరియల్‌ను నేరుగా వారే కొనుగోలు చేసి పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సప్లరు చేయాల్సి ఉంటుంది. రెండేండ్లపాటు గ్రూపు మహిళలు సక్రమంగానే పంపిణీ చేసినా ఆ తర్వాత అర్ధాంతరంగా చేతులెత్తేశారు. తయారీ నిలిపివేసి సంవత్సరం కావస్తున్నా ఆ పరిశ్రమను తిరిగి కొనసాగించట్లేదు. ఐటీడీఏ పీవో కూడా దృష్టి పెట్టకపోవడంతో తయారీకేంద్రం ఇక కొనసాగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే మహిళలకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఆయా బ్యాంక్ యాజమాన్యాలు ముందుకు వచ్చి వారికి రుణాలను మంజూరు చేయాలి. అయితే ఈ రెండు సంవత్సరాల కాలంలో రుణాలు ఇవ్వడానికి ఒక్క బ్యాంకు కూడా ముందుకు రాకపోవడంతో గ్రూప్ మహిళలు చేసేది ఏమీ లేక చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.
ఆర్డర్లు రాక తయారీ కేంద్రాన్ని నిలిపివేశాం
యూనిట్ ప్రారంభం నుంచి గ్రూప్ మహిళలందరం తలా కొంత వేసుకొని రా మెటీరియల్ కొనుగోలు చేసి న్యూట్రిషన్ ఫుడ్ ప్రారంభించాం. రెండు సంవత్సరాల పాటు ఆశ్రమ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేశాం. దాంతో కొంత ఉపాధి పొందాం. గతంలో ఉన్న ఐటీడీఏ పీఓ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన ఆర్డర్లను మాకే ఇచ్చేవారు. ఆ తర్వాత మాకు ఆర్డర్లు రాక ఉత్పత్తి ఆగిపోయింది. ప్రస్తుత పీఓ చిత్రమిశ్రాకు చాలా సార్లు మొరపెట్టుకున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. ఒకవేళ పౌష్టికాహార పదార్థాలను తయారు చేసినా అవి ఆర్డర్లు లేక చెడిపోతున్నాయి. దాంతో మేము నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పీఓ స్పందించి ఆర్డర్లు ఇస్తే తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.
– పోదేమ్ యశోద, గ్రూపు మహిళ
లక్షలు వెచ్చించారు… లక్షణంగా వదిలేశారు !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES