Sunday, September 28, 2025
E-PAPER
Homeజాతీయం12 గంటల ఆలస్యంగా ‘లాల్‌బాగ్చా’ నిమజ్జనం

12 గంటల ఆలస్యంగా ‘లాల్‌బాగ్చా’ నిమజ్జనం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దేశవ్యాప్తంగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముంబయిలో అత్యంత ప్రాచుర్యం పొందిన లాల్‌బాగ్చా గణపతి నిమజ్జనం ఆదివారం రాత్రి 9.15గంటల సమయంలో పూర్తయ్యింది. అయితే, నిర్దేశించిన సమయం కంటే దాదాపు 12-13 గంటల ఆలస్యంగా జరిగింది. అరేబియా సముద్రంలో ఆటుపోట్ల కారణంగానే సుదీర్ఘ ఆలస్యం జరిగినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

నిమజ్జనంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.30కు లాల్‌బాగ్చా రాజా ఊరేగింపు మొదలయ్యింది. ఆదివారం ఉదయం 8గంటలకు నిమజ్జనం చేసే గిర్‌గావ్‌ చౌపటీ బీచ్‌కు చేరుకుంది. అనంతరం మత్స్యకారుల పడవలతో ప్రత్యేకంగా నిర్మించిన తెప్ప సాయంతో సముద్రంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిర్ణయించుకున్న సమయం కంటే 10-15 నిమిషాలు ఆలస్యంగా బీచ్‌కు రావడం, అంచనాల కంటే ముందస్తుగానే ఆటుపోట్లు ప్రారంభం కావడం సమస్యగా మారింది.

సముద్రం ఆటుపోట్ల కారణంగా చాలా సేపు వేచిచూడాల్సి వచ్చింది. అనేక ప్రయత్నాల అనంతరం సాయంత్రం 4.45గంటలకు రాఫ్ట్‌పైకి తరలించారు. వేలాది మంది భక్తులు గణపతి బప్పా మోరియా నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. అయినప్పటికీ సముద్రంలో ప్రతికూల వాతావరణంతో ఆటుపోట్లు తగ్గేవరకు వేచిచూడాలని నిర్వాహకులు నిర్ణయించారు. చివరకు సాయంత్రం 7-8గంటల సమయంలో రాఫ్ట్‌ తేలడంతో సముద్రంలోపలికి తరలించారు. ప్రత్యేక పూజల అనంతరం రాత్రి 9.35గంటలకు నిమజ్జనం పూర్తిచేశారు.

సాధారణంగా ఉదయం 9గంటల లోపే లాల్‌బాగ్చా రాజా నిమజ్జనం పూర్తవుతుంది. కానీ, ఈసారి మాత్రం అత్యంత ఆలస్యంగా (సుమారు 13గంటల) ఈ కార్యక్రమం పూర్తయింది. ఊరేగింపు మొదలైనప్పటి నుంచి 32గంటల తర్వాత మహాగణపతి నిమజ్జనం పూర్తికావడం గమనార్హం. అయితే, ఆటుపోట్లతోపాటు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయని, అందుకే నిమజ్జనం ఆలస్యమైనట్లు నిర్వాహకులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -