Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఓట్లు లేవ్‌!

ఓట్లు లేవ్‌!

- Advertisement -

– లాలూ, నితీశ్‌ సొంతజిల్లాలో భారీగా ఓట్లకు గండి
– ఛిద్రంగా బీహార్‌ ఎన్నికల ముఖచిత్రం
– ‘సర్‌’తో లక్షలాదిమంది ఓటుకు దూరం
పాట్నా:
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రతిపాదించి, కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా అమల్లోకి తెచ్చిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ప్రాంతీయ పార్టీలదే హవా. ముఖ్యంగా ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది. ఈ పార్టీలకు చెందిన నేతలే ముఖ్యమంత్రులుగా బీహార్‌ పాలిస్తుంటారు. మోడీ సర్కార్‌ తెచ్చిన ‘సర్‌’తో ఇప్పుడు వీరి ఆధిపత్యానికి గండిపడనుంది. ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ సొంత జిల్లా గోపాల్‌గంజ్‌లో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 15.10 శాతం ఓట్లను ‘సర్‌’ పేరుతో జాబితా నుంచి తొలగించారు. అలాగే బీహార్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ సొంత జిల్లా నలంద. ఇక్కడ ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మొత్తంగా ఆరు శాతం ఓట్లను ‘సర్‌’ పేరుతో ఓటర్ల జాబితా నుంచి ఎత్తేశారు. తొలగించబడిన ఓట్లన్నీ ఆ రెండు పార్టీల గెలుపోటములను తారుమారు చేసేవే కావడం గమనార్హం! బీహార్‌ రాష్ట్రంలోని మొత్తం 38 జిల్లాల్లోనూ ఇదే తరహాలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొడుతూ ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించారు. సీఈసీ ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. బీహార్‌లో ఎక్కువగా వలసలు, నిరుద్యోగంతో పాటు చదువుకోని వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సీఈసీ పెట్టిన ధ్రువీకరణ పత్రాల మెలికతో భారీ సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోతున్న విషయం తెలిసిందే.
ఓట్ల తొలగింపు ఇలా…
2025 జూన్‌ 24 నాటికి బీహార్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 7.89 కోట్లు. వీరిలో 7.24 కోట్ల మంది ఓట్లు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ప్రతిలో ఉన్నాయి. 65.6 లక్షల (8 శాతం) ఓటర్ల పేర్లను ఆ జాబితా నుంచి తీసేశారు. తమ అభ్యంతరాలను ఓటర్లు సకాలంలో నమోదు చేసి, ‘సర్‌’ ధృవీకరించిన పత్రాలను చూపించలేకపోతే తుది జాబితా నుంచి వారందరి పేర్లు తొలగిస్తామని కేంద్రఎన్నికల సంఘం (సీఈసీ) ఇప్పటికే ప్రకటించింది. బీహార్‌లో ‘సర్‌’ అమలు తర్వాత, గోపాల్‌గంజ్‌ జిల్లాలోని నియోజకవర్గాల నుంచి 15.10 శాతం ఓటర్ల పేర్లను తొలగించారు. సీమాంచల్‌లో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో పూర్ణియాలో 12.08 శాతం, కిషన్‌గంజ్‌ 11.82 శాతం, కతిహార్‌లో 8.27 శాతం , అరారియాలో 7.59 శాతం ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ నాలుగు జిల్లాల్లో ముస్లిం జనాభా ఇతర జిల్లాల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. నలంద జిల్లాలోని షేక్‌పురా నియోజకవర్గంలో 5.13 శాతం, అర్వాల్‌లో 6 శాతం, నలందలో 5.57 శాతం ఓట్లను తొలగించారు. బీహార్‌ రాజధాని పాట్నాలో 7.84 శాతం ఓటర్లను డ్రాఫ్ట్‌ జాబితాలో చేర్చలేదు.
ఇదీ ‘సర్‌’ లెక్క
బీహార్‌లోని 38 జిల్లాల్లో ‘సర్‌’ అమలు తర్వాత 22,34,501 మంది ఓటర్లు మరణించినట్టు గుర్తించారు. మరో 36,28,210 మంది ఓటర్లు వలస వచ్చినట్టు గుర్తించారు. 7,01,364 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు చేసుకున్నారనే చెప్తూ, వారందరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img