– టాప్‌లేపిన మెక్‌లారెన్ డ్రైవర్
– హంగేరియన్ గ్రాండ్‌ప్రీ 2025
బుదాపెస్ట్ (హంగరీ)
ఫార్ములా వన్ (ఎఫ్1) రేసింగ్‌లో ఈ ఏడాది మెక్‌లారెన్‌కు ఎదురు లేదు. సీజన్ ఆరంభం నుంచి వరుస గ్రాండ్‌ప్రీలను కైవసం చేసుకుంటున్న మెక్‌లారెన్.. తాజాగా హంగేరియన్ గ్రాండ్‌ప్రీని సైతం సొంతం చేసుకుంది. ల్యాండో నోరిస్, ఆస్కార్ పియాస్ట్రి నువ్వా నేనా అంటూ ప్రతి రేసులోనూ రరురరుమని దూసుకెళ్తున్నారు. ఆదివారం ముగిసిన హంగేరియన్ గ్రాండ్‌ప్రీలో ల్యాండో నోరిస్ విజేతగా నిలిచాడు. 70 ల్యాప్‌ల బుదాపెస్ట్ రేసింగ్ సర్క్యూట్‌లో ల్యాండో నోరిస్ అదరగొట్టాడు. 1.35.21.231 సెకండ్లలో రేసును ముగించి పోడియం ఫినిష్ చేశాడు. మెక్‌లారెన్ మరో డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి సహచర డ్రైవర్ నోరిస్ కంటే 0.698 సెకండ్ల వెనుకంజలో నిలిచి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. జార్జ్ రసెల్ (మెర్సిడెస్), చార్లెస్ లాక్రెక్ (ఫెరారి), ఫెర్నాండో అలోన్సో (ఆష్టన్ మార్టిన్) టాప్-5లో నిలిచారు.
మెక్‌లారెన్.. 200
ఎఫ్1 రేసింగ్ జట్టు మెక్‌లారెన్ అరుదైన మైలురాయి అందుకుంది. ఎఫ్1 రేసింగ్ చరిత్రలో ఆ జట్టు 200వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్‌లో ఆస్కార్ పియాస్ట్రి, ల్యాండో నోరిస్‌లు పోటీపడుతూ విజయాలు సాధించటం మెక్‌లారెన్‌కు గొప్పగా కలిసొచ్చింది. కన్‌స్ట్రక్టర్ల చాంపియన్‌షిప్స్ (టీమ్ చాంపియన్‌షిప్) మెక్‌లారెన్ ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. మెక్‌లారెన్ (559) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మెర్సిడెస్ (260) రెండో స్థానంలో నిలిచింది. రెడ్‌బుల్ (194), విలియమ్స్ (70), ఆష్టన్ మార్టిన్ (52), సుబేర్ (51), రేసింగ్ బుల్స్ (45), హాస్ (35), ఆల్ఫైన్ (20) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సీజన్ ఓవరాల్ డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో మెక్‌లారెన్ డ్రైవర్లు టాప్-2లో కొనసాగుతున్నారు. ఆస్కార్ పియాస్ట్రి (284) నం.1గా కొనసాగుతుండగా.. ల్యాండో నోరిస్ (275) ద్వితీయ స్థానంలో నిలిచాడు. మాక్స్‌వెర్‌స్టాపెన్ (187), జార్జ్ రసెల్ (172), చార్లెస్ (151), లూయిస్ హామిల్టన్ (109)లు టాప్-6లో కొనసాగుతున్నారు.