జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
భూ నిర్వాసితులకు చాలీచాలని పరిహారం
రైతుల పక్షాన జాగృతి ఉద్యమం
వెలిమినేడులో జాగృతి జనం బాట
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం
వెలిమినేడు గ్రామంలో ఎరోస్పేస్ కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం కంపెనీలను మాత్రం ఏర్పాటు చేయలేక పోతోందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. భూ నిర్వాసితులకు చాలీచాలని నష్టపరిహారంతో చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. వెలిమినేడు గ్రామ రైతుల పక్షాన జాగృతి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలబడతామన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వెలిమినేడు గ్రామంలో శుక్రవారం పర్యటించారు.
కవితకు వెలిమినేడు గ్రామ మహిళలు ఘన స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మలతో ఆడి పాడారు. కవిత బతుకమ్మ పాటలు ఆలపిస్తూ బతుకమ్మ ఆడారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ఎలిమినేడు గ్రామంలో ఎరోస్పేస్ పేరుతో భూములు తీసుకున్నదని తెలిపారు. కానీ ఇప్పటికీ ఒక కంపెనీ కూడా నెలకొల్పలేదని విమర్శించారు. భూ నిర్వాసిత రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదన్నారు. చాలీచాలని పరిహారాన్ని మాత్రమే చెల్లించిందన్నారు. వచ్చిన పరిహారం కూడా ఒకేసారి ఇవ్వకపోవడం వల్ల రైతులు చిల్లర ఖర్చులకే ఉపయోగించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ గ్రామంలో కొంతమంది రైతులను తమ సమస్యలు చెప్పుకోనికి రానివ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. రైతులు రాకపోయినా మహిళలు వచ్చి స్వాగతం పలికారని భూ నిర్వాసిత రైతుల పక్షాన జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని వారికి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంతో పోట్లాడుతామని తెలిపారు. రైతులకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో అందే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు వివరించారు. భూములు కోల్పోయిన రైతాంగ కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సూది లేదు దూది లేదు..
జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటించడం జరుగుతుందని కవిత తెలిపారు. గత రెండు రోజులుగా పర్యటించిన గ్రామాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు దుస్థితి అద్వానంగా తయారయిందన్నారు. ఆయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు సరైన వైద్యం అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. “దూది ఉంటే సూది లేదు.. సూది ఉంటే దూదు” అని విమర్శించారు. ఇక పేదలకు నాణ్యమైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. అందుకనే ప్రైవేట్ హాస్పటల్ వైపు వెళుతున్నారని గుర్తు చేశారు. ఇలాంటి సమస్యలు తెలుసుకునేందుకు జాగృతి జనం బాట పట్టిందని తెలిపారు.
అభివృద్ధికి దూరం..
హైదరాబాదుకు కూతవేటు దూరంలో ఉన్న వెలిమినేడు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని కవిత పేర్కొన్నారు. ఈ గ్రామంలో రైతాంగం అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారని గుర్తు చేశారు. వారిని తమ సమస్యల చెప్పుకోనివ్వకుండా బంటి చింటూ అనే పేరుతో అడ్డుకుంటున్నారని బెదిరిస్తున్నారని, అయినా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పురుషులు రాకపోయినా స్త్రీలు వచ్చి తమ సమస్యలు వివరించుకున్నారని వారి విన్నతులను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినట్లు తెలిపారు. ఏ సమస్య అయినా చెప్పుకుంటేనే పరిష్కారానికి మార్గం దొరుకుతుందని తెలిపారు. తద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అయినా ఈ గ్రామంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులోనూ కృషి చేస్తామన్నారు. ఈ గ్రామ రైతాంగానికి జాగృతి అండగా నిలుస్తుందని తెలిపారు.
ఎన్నికల హామీల అమలులో విఫలం..
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎన్నికల్లో నిరుద్యోలకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చిందని నేడు మాట తప్పిందన్నారు. మహిళలకు రూ.2500 అందజేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. రెండున్నర సంవత్సరాలు గడుస్తున్న మహిళలకు ఇవ్వాల్సిన రూ.2500 ఊసే ఎత్తడం లేదన్నారు. ఇప్పటికీ మహిళల నుంచి మూడుసార్లు దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. మరోవైపు రెండు 2000 రూపాయల ఉన్న వృద్ధులు, వితంతువుల పింఛన్ రూ.4000, వికలాంగులకు రూ.6 వేలకు పెంచి అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మొరపెట్టుకుంటున్న పట్టించుకోవడం లేదన్నారు. మోసపోయిన వారిని అక్కున చేర్చుకొని ఈ ప్రభుత్వంతో పోట్లాడేందుకే జాగృతి ముందడుగు వేస్తోందని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. ఈ ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బతుకమ్మ ఆడి పాడిన కవిత.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల మేలవింపుగానే జాగృతి ఉద్భవించిందని కవిత తెలిపారు. గ్రామానికి చేరుకున్న తర్వాత మహిళలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. నేరుగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఆవరణలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు. తనే స్వయంగా బతుకమ్మ పాట చెబుతూ మహిళలతో చిందేశారు. స్థానిక మహిళలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో మంచి రెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి, స్థానికులు తదితరులు ఉన్నారు.



