నవతెలంగాణ-హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో మండి జల్లాలో నిహ్రీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇల్లు కూలిపోయి ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరు వ్యక్తుల్ని మాత్రం రెస్క్యూ సిబ్బంది రక్షించారు. సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్స్ చేరుకుని.. సహాయకచర్యలు చేపట్టినట్లు ఎస్‌పి సాక్షి వర్మ చెప్పారు.
కాగా, సోన్‌ఖాడ్ నది పొంగిపొర్లడంతో మండి జిల్లాలో ధరంపూర్ పట్టణంలో బస్టాస్టాండ్‌లో వరద నీరు చేరింది. దీంతో ఆ నీటి ప్రవాహంలో అనేక బస్సులు, కార్లు, బైకులు, స్కూటర్లు కొట్టుకుపోయాయి అని ధరమ్‌పూర్ డిసిపి సంజీవ్ సూద్ తెలిపారు. నదీ ప్రవాహంతో ఇళ్లు, షాపులు ముంపుకు గురయ్యాయి. నివాసితులు ఇంటి పైకప్పులు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. హాస్టల్ భవనంలోకి కూడా నీరు చేరడంతో.. విద్యార్థులంతా ఆ భవనం పైకి ఎక్కారని డిసిపి సంజీవ్ సూద్ తెలిపారు. నిన్న రాత్రి నుంచే రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టినట్టు డిసిపి చెప్పారు.