Sunday, May 25, 2025
Homeఆటలునాయకుడు శుభ్‌మన్‌

నాయకుడు శుభ్‌మన్‌

- Advertisement -

– సాయి సుదర్శన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌కు చోటు
– ఇంగ్లాండ్‌ టూర్‌కు భారత టెస్టు జట్టు ఎంపిక
– వైస్‌ కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

ఐదు రోజుల ఆటలో టీమ్‌ ఇండియా యువ శకంలోకి అడుగుపెట్టింది. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌ వీడ్కోలుతో భారత టెస్టు జట్టును యువ నాయకత్వం ముందుండి నడిపించనుంది. భారత టెస్టు జట్టుకు 25 ఏండ్ల శుభ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా, 27 ఏండ్ల రిషబ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఐదు టెస్టుల సిరీస్‌ గిల్‌, పంత్‌ నాయకత్వానికి తొలి పరీక్ష కానుంది.
దేశవాళీ సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తున్న బి. సాయి సుదర్శన్‌, వైట్‌బాల్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న అర్ష్‌దీప్‌ సింగ్‌కు టెస్టు జట్టులో తొలిసారి చోటు దక్కింది. అభిమన్యు ఈశ్వరన్‌ను సైతం సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయగా.. తెలుగు తేజం నితీశ్‌ కుమార్‌ రెడ్డి వరుసగా రెండో విదేశీ పర్యటనకు వెళ్లనున్నాడు.

నవతెలంగాణ-ముంబయి
ఇంగ్లాండ్‌లో పర్యటించే భారత టెస్టు జట్టును బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ శనివారం ప్రకటించింది. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (25)ను సెలక్షన్‌ కమిటీ కెప్టెన్‌గా ఎంచుకోగా.. టెస్టుల్లో సూపర్‌స్టార్‌ రిషబ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్‌ శర్మకు డిప్యూటీగా వ్యవహరించి, ఆసీస్‌ పర్యటనలో రెండు టెస్టులకు నాయకత్వం వహించిన పేసర్‌ జశ్‌ప్రీత్‌ బుమ్రా ఫిట్‌నెస్‌ కారణాలతో కెప్టెన్సీ అవకాశం కోల్పోయాడు!. జూన్‌ 20 నుంచి షురూ కానున్న ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు 18 మందితో కూడిన జట్టును అజిత్‌ అగార్కర్‌ ప్యానల్‌ ఎంపిక చేసింది.
సాయి సుదర్శన్‌, అర్ష్‌దీప్‌లకు పిలుపు
దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్‌ సహా వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో మెరుస్తున్న అర్ష్‌దీప్‌ సింగ్‌లను సెలక్షన్‌ కమిటీ గుర్తించింది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు సాయి సుదర్శన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లను తొలిసారి టెస్టు జట్టులోకి తీసుకుంది. బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌, ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులో అడుగుపెట్టారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన సర్ఫరాజ్‌ ఖాన్‌, హర్షిత్‌ రానాలను సెలక్టర్లు ఇంగ్లాండ్‌ టూర్‌కు పక్కనపెట్టారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా జట్టులోకి వచ్చిన తనుశ్‌ కొటియన్‌, దేవదత్‌ పడిక్కల్‌లు సైతం ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక కాలేదు.
యువ నాయకత్వం
విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వీడ్కోలుతో భారత టెస్టు జట్టులో నాయకత్వ శూన్యతతో పాటు బ్యాటింగ్‌ లైనప్‌లో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇంగ్లాండ్‌తో సిరీస్‌తో 2025-27 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ రేసు ఆరంభం కానుండగా.. శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌లు భారత్‌ను నడిపించనున్నారు. శుభ్‌మన్‌ గిల్‌ టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్సీ వహించినా.. వన్డేలు, టెస్టులకు ఎన్నడూ నాయకత్వ బాధ్యత చేపట్టలేదు. 25 ఏండ్ల శుభ్‌మన్‌ గిల్‌ 32 టెస్టుల్లో 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. స్వదేశంలో గిల్‌ బ్యాటింగ్‌ సగటు 40 ప్లస్‌ కాగా.. విదేశీ టెస్టుల్లో 30 లోపే ఉండటం గమనార్హం. 27 ఏండ్ల రిషబ్‌ పంత్‌ 43 టెస్టుల్లో 42.11 సగటుతో 3948 పరుగులు చేశాడు.
జట్టు ఎలా ఉందంటే
యువ ఆటగాళ్లతో కూడిన టెస్టు జట్టు అంచనాలను పెంచేలా కనిపిస్తోంది!. బ్యాటింగ్‌ లైనప్‌లో యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ సహా శుభ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌, సాయి సుదర్శన్‌, ధ్రువ్‌ జురెల్‌ ఉన్నారు. రెండో వికెట్‌ కీపర్‌గా జురెల్‌ ఎంపికయ్యాడు. జట్టులో నలుగురు ఆల్‌రౌండర్లను ఎంపిక చేశారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్లు కాగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శార్దుల్‌ ఠాకూర్‌ పేస్‌ ఆల్‌రౌండర్లు. కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కడే స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా జట్టులో నిలిచాడు. పేస్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణ, అర్ష్‌దీప్‌ సింగ్‌లు నిలిచారు.
ఇదీ షెడ్యూల్‌
ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌ ఐదు టెస్టులు ఆడనుంది. జూన్‌ 20 నుంచి తొలి టెస్టు హీడింగ్లేలో ఆరంభం కానుండగా.. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు (జులై 2 నుంచి), లార్డ్స్‌లో మూడో టెస్టు (జులై 10 నుంచి), ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో నాల్గో టెస్టు (జులై 23 నుంచి), ఓవల్‌లో ఐదో టెస్టు (జులై 31 నుంచి) జరుగనున్నాయి. ఐపీఎల్‌18 ఫైనల్‌ అనంతరం లండన్‌కు చేరుకోనున్న టీమ్‌ ఇండియా క్రికెటర్లు జూన్‌ 13-16న భారత్‌-ఏతో నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.
భారత టెస్టు జట్టు : శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కెఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌, ప్రసిద్‌ కృష్ణ, సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌, కరుణ్‌ నాయర్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దుల్‌ ఠాకూర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.
శుభ్‌మన్‌ గిల్‌ టెస్టు కెప్టెన్‌గా రాణిస్తాడని సెలక్షన్‌ కమిటీ భావిస్తోంది. కొత్త కెప్టెన్‌కు మా శుభాకాంక్షలు. డ్రెస్సింగ్‌రూమ్‌ సహా పలువురి అభిప్రాయాలను తీసుకోవటంతో పాటు గత రెండేండ్లుగా గిల్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాం. గిల్‌ యువకుడు. నాయకుడిగా పరిణితి చూపిస్తున్నాడు. సారథిగా సరైన వ్యక్తినే ఎంచుకున్నామని అనుకుంటున్నాం. గత కొన్నేండ్లుగా టెస్టుల్లో గొప్పగా రాణిస్తున్న ఆటగాళ్లలో పంత్‌ ఒకడు. పంత్‌ అనుభవం గిల్‌కు ఉపయోగపడుతుంది. జశ్‌ప్రీత్‌ బుమ్రా సహా పలు ఇతర ఆప్షన్లను సైతం కెప్టెన్సీ కోసం పరిశీలించాం. ఇంగ్లాండ్‌ పర్యటనలో గిల్‌ ఐదు టెస్టులు ఆడతాడని అనుకోవటం లేదు. వైద్య బృందం, ఫిజియోలు సూచనలతో బుమ్రా ఫిట్‌నెస్‌ ముఖ్యమని భావించాం. కెప్టెన్‌గా కంటే ఆటగాడిగా బుమ్రా జట్టుకు ఎంతో అవసరం. ఆ విషయాన్ని అతడితో చర్చించాం. ఇంగ్లాండ్‌తో ఎన్ని టెస్టుల్లో ఆడినా.. కచ్చితంగా విజయంలో బుమ్రా పాత్ర కీలకం కానుంది. బుమ్రా పని భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం’
– అజిత్‌ అగార్కర్‌, చీఫ్‌ సెలక్టర్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -