Sunday, June 15, 2025
E-PAPER
Homeమానవిప్రేమించడం నేర్చుకున్నా

ప్రేమించడం నేర్చుకున్నా

- Advertisement -

మా నాన్న లక్ష్మణ్‌ రావు నాంపల్లి. అమ్మ సునీత. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. సొంతూరు షాద్‌నగర్‌. నేను పుట్టింది మాత్రం హైదరాబాద్‌. నాన్న డిప్యూటీ తాసీల్దార్‌గా చేసేవారు. చిన్నప్పటి నుండి నాకు నాన్నతో అనుబంధం ఎక్కువ. ఏ విషయమైనా పంచుకునేదాన్ని. నాకు దేని మీద ఎక్కువ శ్రద్ధ ఉందో గ్రహించి ప్రోత్సహించేవారు. మా అమ్మమ్మ పాటలు పాడేవారు. అమ్మ కూడా పాటలు పాడతారు. వారి నుండే నాకూ ఈ కళ అబ్బింది. చిన్నప్పటి నుండి అమ్మ చెప్పే పద్యాలు, శ్లోకాలు స్కూల్లో వల్లే వేస్తూ ఉండేదాన్ని. శ్రద్ధగా, రాగయుక్తంగా పాడటం చూసి నాన్న సంగీత తరగతులకు పంపించారు. ఇంటర్‌ చదువుతుండగా నాన్న నా మొదటి కచేరి రవీంద్రభారతిలో ఏర్పాటు చేసి నాకు పుట్టిన రోజు కానుక ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. కీరవాణి, మణిశర్మ, చక్రి గార్లతో చేసాను. ఒక వైపు చదువు, ఇంకోవైపు సంగీతం. రెండు సమన్వయం చేసుకునేదాన్ని. ఒక రోజు నాన్న జర్నలిజం చేయవచ్చుగా అన్నారు. దాంతో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో న్యూస్‌ రీడర్‌, రిపోర్టర్‌గా చేశాను. ఎందరో ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశాను. ఆవిధంగా నేను నాన్న కోరిక తీర్చాను. సంగీత కళాకారిణిగా, జర్నలిస్ట్‌గా రాణించగలిగాను.
నేను యాంకర్‌ అవ్వడానికి కారణం నాన్ననే. జెమినీ ఛానల్‌ వాళ్ళు వచ్చి నాన్నతో మాట్లాడితే మొదట ఒప్పుకోలేదు. నేను కన్విన్స్‌ చేసే సరికి ఒప్పుకున్నారు. అలా నేను ‘పాడమని నన్ను అడగవలెనా’ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేసాను. నాన్న ఏనాడు నన్ను కొట్టింది లేదు, కోప్పడింది లేదు. ఒక సారి అమ్మ నన్ను కొడితే, అమ్మ మీద అలిగి నాన్న వచ్చేవరకు గేట్‌ దగ్గరే నిలబడ్డాను. అప్పుడు నాన్న వచ్చి నా దెబ్బలు చూసి ఏడ్చేశారు. నాన్నకు పిల్లల్ని బైటకు తీసుకెళ్లాలి, అన్నీ చూపించాలనే కోరిక ఎక్కువ. మమ్మల్ని ఎక్కువ అహోబిలం, తిరుమలకు తీసుకు వెళ్లేవారు.
నాన్న నుండి నేను నేర్చుకున్నది ఏమిటంటే ఎదుటివారికి సాయపడాలి, ధర్మంగా ఉండాలి. ఎదుటి వారు ఎలాంటి వారైనా సరే మన ఇంటికి వచ్చినప్పుడు ఆదరించి, మర్యాద చేయాలి. సమయ పాలన, మనుషులను ప్రేమించడం నాన్న దగ్గరే నేర్చుకున్నాను. నాన్నకు గుండె సమస్య మొదలయ్యాక చాలా కుంగిపోయారు. ఆయన్ని హాస్పిటల్‌లో చేర్పించినప్పుడు నేనే చూసుకున్నాను. నాన్నను చూసుకోవడం నా బాధ్యత అనుకున్నాను. ఈ రోజు ఇలా ఉన్నానంటే నాన్నే కారణం. నాన్న వెళ్ళిపోయినా ఆయన నా పక్కనే ఉన్న భావన, ధైర్యం.
– స్వాతి మైత్రేయి, గాయని, నటి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -