Tuesday, July 15, 2025
E-PAPER
Homeజాతీయంలెక్చరర్‌ వేధింపులు..నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి

లెక్చరర్‌ వేధింపులు..నిప్పంటించుకున్న విద్యార్థిని మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : కాలేజీ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు భరించలేక ఒడిశాకు చెందిన ఓ విద్యార్థిని నిప్పంటించుకున్న సంగతి తెలిసిందే. 95 శాతం గాయాలపాలైన బాధితురాలు మూడు రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ సోమవారం రాత్రి మృతిచెందింది. భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ ఐసీయూలోని బర్న్స్ వార్డులో చికిత్సనందిస్తూ, మూత్రపిండ మార్పిడి చికిత్సతో సహా అన్ని సాధ్యమైన వైద్య సహాయం అందించినప్పటికీ, బాధితురాలిని బతికించలేకపోయామని, ఆమె సోమవారం రాత్రి 11:46 గంటలకు మరణించిందని ఆస్పత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు.

బాలేశ్వర్‌లోని ఫకీర్‌ మోహన్‌ కాలేజీలో ఓ విద్యార్థిని ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. విభాగాధిపతి సమీర్‌ కుమార్‌ కొన్నినెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని… అకడమిక్‌ కెరీర్‌ను నాశనం చేసి, భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నారని జూలై 1న ఆమె కాలేజీ అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి 10 రోజులైనా యాజమాన్యం స్పందించడం లేదని, పైగా కాలేజీ ప్రిన్సిపాల్‌ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని బాధితురాలు గత వారం రోజులుగా కాలేజీ ఆవరణలో నిరసన చేపట్టింది. శనివారం (జులై 12) ఉదయం కూడా తోటి విద్యార్థులతో కలిసి కాలేజీ ముందు ఆందోళనకు దిగింది. అదే సమయంలో ప్రిన్సిపల్‌ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగెత్తిన ఆమె.. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ క్రమంలో ఆమెను మంటల్లోంచి కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థినికి 70శాతం మేర గాయాలయ్యాయి.

కాగా, లైంగిక వేధింపులకు సంబంధించి విద్యార్థిని ఫిర్యాదు చేసిందని, దీనిపై అంతర్గత కమిటీ దర్యాప్తు చేపడుతోందని కాలేజీ ప్రిన్సిపల్‌ వెల్లడించారు. శనివారం ఉదయం కూడా ఇదే విషయంపై బాధిత విద్యార్థిని తనను కలిసి మాట్లాడిందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హెచ్‌వోడీని అదుపులోకి తీసుకున్నారు.

ఇక ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి స్పందించారు. విద్యార్థిని మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ, దోషులకు కఠినమైన శిక్ష పడుతుందని ఆమె కుటుంబానికి హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -