Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలు9న సార్వత్రిక సమ్మెకు వామపక్షాల మద్దతు

9న సార్వత్రిక సమ్మెకు వామపక్షాల మద్దతు

- Advertisement -

– కార్మికుల హక్కులను కాలరాస్తున్న మోడీ సర్కారు
– యాజమాన్యాల కోసమే 4 లేబర్‌ కోడ్‌లు
– సంపన్నుల చేతుల్లోనే సంపద : కూనంనేని
– కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి : జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఈనెల తొమ్మిదిన నిర్వహించతలపెట్టిన సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలు మద్దతునిచ్చాయి. ఈ సమ్మెను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చాయి. అనేక పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను మోడీ ప్రభుత్వం కుదిస్తున్నదని విమర్శించాయి. కార్మికుల హక్కులను కాలరాసి, యాజమాన్యాలకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్‌లను తెస్తున్నదని తెలిపాయి. సోమవారం హైదరాబాద్‌లోని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో వామపక్షా పార్టీల నాయకులు విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు.

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : జాన్‌వెస్లీ
కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్‌లుగా మారుస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. కార్మికులకు సమ్మె చేసే హక్కును, సంఘం పెట్టుకునే హక్కును కాలరాస్తున్నదని చెప్పారు. ఎనిమిది గంటల పనివిధానాన్ని 12 గంటల పని విధానానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని అన్నారు. దేశంలోని కార్మికులు, అసంఘటిత కార్మికులు కనీస వేతనం రూ.26 వేలు ఉండాలంటున్నారని చెప్పారు. కనీస వేతనాలు అమలు కాకపోవడం వల్ల కార్మికుల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు రాకపోవడం వల్ల కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారని అన్నారు. కార్మికుల హక్కులను పూర్తిగా యాజమన్యాలకు అప్పగించడంలో భాగంగా కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్‌ కోడ్‌లుగా తెస్తున్నదని విమర్శించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. వ్యవసాయరంగాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. కార్పొరేట్‌ సంస్థలే వ్యవసాయం చేసే పరిస్థితి వస్తుందన్నారు. దీంతో రైతులు ఆ భూముల్లోనే వ్యవసాయ కూలీలుగా మారే ప్రమాదమున్నదని అన్నారు. ఉపాధి హామీ చట్టం అమలు కోసం రూ.రెండు లక్షల కోట్లు అవసరం కాగా, కేవలం రూ.80 వేల కోట్లను మాత్రమే కేటాయించిందని చెప్పారు. పనిదినాలను తగ్గిస్తూ, నిధుల్లో కోత విధిస్తూ ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల తొమ్మిదిన చేపట్టిన సార్వత్రిక సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్ని జయప్రదం చేయాలని కోరారు.

సంపన్న భారత్‌… పేదల భారత్‌ : కూనంనేని
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల దేశంలో సంపద అంతా కొద్ది మంది సంపన్నుల చేతుల్లో కేంద్రీకృతం అయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దీంతో సంపన్నుల భారత్‌, పేదల భారత్‌గా రెండు భాగాలుగా దేశం విడిపోయిందని చెప్పారు. సంపద కేంద్రీకృతం కావడంతో అసమానతలు పెరిగిపోయాయని విమర్శించారు. దేశ సంపదలో 10 శాతం సంపద మాత్రమే 80 శాతం ప్రజల వద్ద ఉందన్నారు. పది శాతం సంపన్నుల వద్ద 40 శాతం సంపద కేంద్రీకృతమై ఉందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల శ్రమను పెట్టుబడిదారులు రాజ్యాంగ బద్దంగా లూటీ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పర్మినెంట్‌ ఉద్యోగులు తగ్గిపోతున్నారనీ, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పెరిగిపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆవే విధానాలను అవలభిస్తోందని విమర్శించారు. ఆర్థిక వృద్దిలో ప్రపంచంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉందంటూ గొప్పలు చెప్తున్న పాలకులు, ప్రజల కొనుగోలు సూచికలో 164వ స్థానం, ఆకలి సూచికలో 101వ స్థానంలో ఎందుకు ఉందో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ కోట్లాది మంది కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనెల తొమ్మిదిన తలపెట్టిన స్వారత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.


సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం హన్మేష్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అధికార ప్రతినిధి సాదినేని వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం రమేష్‌రాజా, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్‌ మురహరి మాట్లాడుతూ మాట్లాడుతూ దేశంలో లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేస్తున్నదని విమర్శించారు. పెట్టుబడులను ఉపసంహరించి వాటిని ఉద్యోగులు వీఆర్‌ఎస్‌ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని అన్నారు. కేంద్రం నిరంకుశ విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల తొమ్మిదిన జరిగే సమ్మెలో ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కళవేణి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -