మనం చరిత్ర చదివేప్పుడు యోధులు, రాజనీతిజ్ఞులు, దేశాధినేతలు, వ్యూహకర్తలు ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. కొందరిని కొన్నింటికి ప్రతీకలుగా అభిమానిస్తాం. అనుసరిస్తాం. కానీ ఇందులో ప్రతి వర్ణనలో ఇమిడిపోయేవారు చాలా అరుదుగా వుంటారు. అలాంటి అరుదైన మహా నేత, నిర్మాత, సిద్ధాంత సూత్రాల సంధాత, విప్లవాల ప్రయోక్త వ్లదిమీర్ ఇల్యీచ్ లెనిన్. యువకుడుగా విద్యార్థిగా అధ్యయనశీలిగా, ఉద్యమ నిర్మాతగా, వ్యూహశిల్పిగా, విప్లవకారుడుగా, అంతిమంగా చరిత్ర అప్పటి వరకూ ఎరగని అరుణారుణ సామ్యవాద మహారాజ్య నిర్మాతగా నిలిచిపోయిన మహనీయుడు లెనిన్. కమ్యూనిస్టు ఉద్యమంలోనూ సిద్ధాంత కోవిదులూ, సమర సేనానులు అంటూ కనిపిస్తుంటారు గానీ లెనిన్ ఈ రెండింటి మేలు కలయిక. మార్క్స్, ఎంగెల్సుల విప్లవ సిద్ధాంతాన్ని ఆకళింపు చేసి, ఆధునీకరించి, అన్వయించి విజయం సాధించడమే గాక విశ్వవ్యాప్తం చేసిన విజ్ఞాన ఖని. విప్లవ మేధ. యోధ. ఈ రోజు ఆయన 155వ జయంతి. 1870 ఏప్రిల్‌లో ఆయన పుట్టారు.
లెనిన్ పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశగా సామ్రాజ్యవాదమనే భావనను తీసుకొచ్చి ద్రవ్య పెట్టుబడి రూపాలను ఆవిష్కరించి మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సుసంపన్నం చేసిన ధీశాలి. సిద్ధాంతం విజయం సాధించాలంటే ఆచరణలోకి తెచ్చే అగ్రగామి దళం లాంటి శ్రామికవర్గ పార్టీ వుండాలని బోధించడమే గాక మిగిలిన పాలక వర్గ పార్టీలకు భిన్నంగా దాన్ని ఎలా నిర్మించుకోవాలో కూడా ఆచరించి చూపిన దార్శనికుడు. దాన్ని ప్రచారంతో ఆ జనంలోకి తీసుకువెళ్లేందుకు ప్రచార సాధనాలు వుండాలని ప్రజా పత్రికల వరవడికి నాంది పలికాడు. ఇందులో ఒక్కొక్కటి చేయడానికే ఒక జీవిత కాలం చాలదు గానీ ఇవన్నీ చేసి యాభయ్యవ పడిలోనే శాశ్వతంగా తుది శ్వాస విడిచిన అమరజీవి లెనిన్. వ్యక్తిగా జారు చక్రవర్తిని అంతం చేయడం కోసం ప్రయత్నించి ఉరికంబం ఎక్కిన అన్నను ఆరాధిస్తూనే ఆ మార్గం సరైంది కాదని తెలుసుకోగలిగిన ప్రతిభావంతుడు. ఉద్యమ సహచరి కృపస్కయాను విప్లవ పథంలో తోడుగా చేసుకున్న ప్రేమికుడు. తన తర్వాత సోషలిజాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్టాలిన్ వంటి వారికి బాధ్యతలు అప్పగించి దూరంగా గడిపిన త్యాగశీలి.
‘సామ్రాజ్యవాదం-పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ’ (1916) అనే తన మహత్తర గ్రంథంలో లెనిన్ తొలిసారిగా 19వ శతాబ్దపు లక్షణాలను క్రోడీకరించాడు. ఈ దశలో పెట్టుబడిదారీ విధానం గుత్త స్వభావం సంతరించుకుంటుంది. దేశాల ఆర్థిక వ్యవస్థల్లో గుత్త సంస్థలే కీలక పాత్ర వహిస్తాయి. గుత్తాధిపత్యం సామ్రాజ్యవాద దశ మొదటి లక్షణం. సరుకుల ఎగుమతి బదులు పెట్టుబడి ఎగుమతి రెండో లక్షణం. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలగలసిన ఫైనాన్స్ పెట్టుబడి ప్రాబల్యం పెరగడం మూడో లక్షణం. నాలుగో లక్షణం వివిధ దేశాల గుత్త సంస్థలు చేతులు కలిపి గొలుసుకట్టుగా ఏర్పడ్డం. చివరి లక్షణం ఈ క్రమంలో అగ్ర స్థాయి పెట్టుబడిదారీ దేశాలు ప్రపంచ భూభాగాన్ని తమ మధ్య పంచుకోవడం ఆ పంపకాలలో వాటాలు పెంచుకోవడానికి పునర్విభజనకు యుద్ధాలు సృష్టించడం-ఇవీ లెనిన్ వివరించిన అంశాలు. వీటి ఆధారంగా తమ దేశంలో కర్తవ్యాలను వాటిని సాధించే రాజకీయ శక్తిగా కార్మికవర్గ పార్టీని ఆయన అంకురార్పణ చేశాడు. ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలోనే రష్యా ప్రపంచ విప్లవ శక్తులకు ప్రధాన ప్రేరణ అయింది. 1898లో రష్యన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడింది. 1903లో పార్టీ రెండవ మహాసభలో పార్టీ నాయకత్వానికి జరిగిన ఎన్నికల్లో లెనిన్ భావాలను బలపరచేవారు అధికంగా ఎన్నికైనారు. అందుకు వ్యతిరేకంగా తప్పుడు సిద్ధాంతాలను బోధించేవారు ఓడిపోయారు. ఈ రెండు వర్గాలను బోల్షివిక్ (మెజారిటీ) మెన్షివిక్ (మైనారిటీ) అన్నారు. 1905 డిసెంబర్‌లో కార్మికులు 1905లో రష్యా సైనికుల సాయుధ తిరుగుబాటు చేయగా అది విఫలమైంది. అయినా ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ముఖ్యంగా కార్మికులలో ఐక్యత అవసరాన్ని చెప్పింది. ”1905 డ్రెస్ రిహార్సల్ లేకపోతే 1917 అక్టోబర్ విప్లవం అసాధ్యమై వుండేది” అని లెనిన్ అన్నారు. 20వ శతాబ్ది ప్రారంభం నాటికే ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య శతృత్వాలు, ఘర్షణలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సామ్రాజ్యవాదులు కొత్తగా వలసలు ఏర్పరచుకోవడానికి ఎక్కడా భూభాగం అందుబాటులో లేదు. అలాంటి తరుణంలో సంభవించిన వివిధ ఘటనలు ప్రపంచయుద్ధ పరిస్థితికి దారితీశాయి. చివరకు 1914 ఆగస్టు 1న మొదటి ప్రపంచ యుద్ధం ప్రజ్వరిల్లింది. అవకాశవాద కార్మిక నేతలు తమ తమ దేశాలలో పాలకులను బలపర్చే విధానం తీసుకున్నారు. 1914లో నెదర్లాండ్స్‌లో వున్న లెనిన్ కార్మికోద్యమానికి నూతన విప్లవ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. ఇది సామ్రాజ్యవాద యుద్ధమంటూ అవకాశవాద పోకడలను ఖండించాడు. సామ్రాజ్యవాద యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలని పిలుపునిచ్చారు.
అక్టోబర్ 25, 26 తేదీల (కొత్త తేదీ నవంబర్ 7) మధ్య తెల్లవారుతుండగా సైనికులు, నావికులు రష్యా చక్రవర్తుల నివాస భవనమైన వింటర్ ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. జార్ చక్రవర్తి కూల్చివేత అనంతరం కూడా లెనిన్ ఓపికతో అనేక వ్యూహాలు అనుసరించారు. అయితే తాత్కాలిక ప్రభుత్వం చేతుల్లో నుంచి సోవియట్లకు అధికారం బదలాయించేందుకు జరిగిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాకే విప్లవం అవసరమైంది. దానిపై పెట్టుకున్న ఆశలు వమ్మయినందువల్లనే ప్రజలు విప్లవాన్ని సంపూర్ణంగా బలపరిచారు. నవంబర్ 7వ తేదీన 2 కోట్ల మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే సోవియట్ల ప్రతినిధులు లెనిన్ నాయకత్వాన నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సోవియట్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటగా శాంతి కోసం విజ్ఞప్తి చేసే డిక్రీ ఆమోదించింది. ప్రజాతంత్రబద్ధమైన న్యాయమైన శాంతి కోసం సంప్రదింపులకు సిద్ధంగా వున్నట్లు యుద్ధంలో పాల్గొనే దేశాలకు తెలియచేసింది. భూస్వాములకు, చర్చిలకు సంబంధించిన పొలాలను, పశుసంపదను ఎలాంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకునే మరో డిక్రీ, 8 గంటల పనిదినంపై ఇంకో డిక్రీ ఆమోదించింది. జాతుల స్వయం నిర్ణయాధికార హక్కును, విడిపోయే స్వేచ్ఛను గుర్తించే డిక్రీ ఇంకోటి. సోవియట్ రష్యా విప్లవ విజయానంతరం కూడా అనేక అగ్నిపరీక్షలను ఎదుర్కోవలసి వచ్చింది. కూలిపోయిన కెరెన్‌స్కీ ప్రభుత్వం విప్లవ వ్యతిరేక ప్రతీఘాత శక్తులను ఎగదోసింది. వైట్ గార్డులనే పేరిట వారు గ్రామాల్లో చేరి తీవ్ర బీభత్సకాండ సృష్టించారు. వాటన్నిటి మధ్యనా లెనిన్ ఎంతో చాకచక్యంగానూ సిద్ధాంతబద్దంగానూ సమయోచితమైన ఎత్తుగడలు అనుసరించారు. ఆర్థికాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించాడు. 1918 జులైలో సోవియట్ తొలి రాజ్యాంగం రూపొందింది. కెరెన్‌స్కీ ప్రతీఘాత చర్యలకు మద్దతుగా సామ్రాజ్యవాద శక్తులు రంగంలోకి దిగాయి. 1918 మార్చిలో ఫ్రెంచి, బ్రిటిష్, అమెరికన్ సేనలు రష్యాలో దిగాయి. ఏప్రిల్ 4,8 తేదీలలో జపాన్ సేనలు కూడా ప్రవేశించాయి. ఈ అంతర్గత బాహ్య శత్రువులను భౌతికంగా ఎదుర్కొంటూ లెనిన్ రష్యాను నిలబెట్టారు. సోవియట్ ప్రభుత్వాన్ని గుర్తించకపోగా చుట్టుముట్టి కూలదోసేందుకు కుట్రలు పన్ని సామ్రాజ్యవాదులు ఆ తర్వాత నెమ్మదిగా దిగివచ్చి, ఒప్పందాలు చేసుకున్నారు.
తమ దేశంతోనే ఆగక లెనిన్ ఇండియాతో సహా దేశదేశాల కార్మిక వర్గ పోరాటాలకు ఊతమిచ్చారు. వలసాధిపత్యంపై పోరాడాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రాచ్య దేశాల విశ్వవిద్యాలయంలో భారతీయ విప్లవకారులకు కూడా తర్ఫీదునిచ్చారు. నిజంగా లెనిన్ శ్రామికవర్గ అంతర్జాతీయతను అమలు చేసిన ప్రపంచ నాయకుడు. ఒక వామపక్ష తీవ్రవాది హత్యాప్రయత్నం కారణంగా లెనిన్ తీవ్రంగా గాయపడిన తర్వాత స్టాలిన్ ఆ స్థానంలో నాయకత్వం చేపట్టారు. ఆ దశలో కూడా లెనిన్ అధ్యయనం కొనసాగించారు. తన వంతు సలహాలు ఇస్తుండేవారు. చివరకు 1921 జనవరి 21 లెనిన్ కన్నుమూశారు.
ఆయన బహుముఖ ప్రజ్ఞ, అపార అధ్యయనం, నిశితమైన సైద్ధాంతిక రచనలు మరెవరితోనూ పోల్చలేనివి. గోర్భచేవ్ వంటి వారి కారణంగా విచ్ఛిన్న చర్యలు మొదలైనాక లెనిన్ విగ్రహాలనే కూల్చడం యాదృచ్ఛికం కాదు. 1991 ఆగష్టులో సోవియట్ విచ్ఛిన్నత వరకూ దారితీసిన ఆ పరిణామాలు… లెనినిస్టు సూత్రాలను పరిత్యజించిన దాని పర్యవసానాలు తప్ప… మార్క్సిజం, లెనినిజం మౌలికతను వమ్ము చేసేవి కావు. ఆయన చెప్పిన సామ్రాజ్యవాదం, ద్రవ్య పెట్టుబడి విశ్వరూపం దాల్చి ప్రపంచీకరణ పేరిట పెత్తనం చేసి ఇప్పుడు అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిన తీరు అమెరికా నుంచి తెలుగు రాష్ట్రాల్లో రొయ్యల వ్యాపారం వరకూ కనిపిస్తూనే వుంది. సాంకేతిక సైనిక వ్యవస్థలలో పెద్ద మార్పులు వచ్చాయి. మీడియా స్వరూపం మారింది. వీటిని సవ్యంగా అర్థం చేసుకుని పోరాడితే విప్లవకర శక్తుల పురోగమనానికి దోహదం కలుగుతుంది. ఆ క్రమంలో ముందువెనకలుంటాయి. ”మా తప్పులను ఆత్మవిమర్శ చేసుకుంటే శత్రువులు నవ్వొచ్చు గాని మేము మాత్రం అది అవసరమనే భావిస్తాం. తప్పులు జరిగితే దిద్దుకుంటాం” అని ఒకటికి నాలుగు సార్లు ఢంకా బజాయించి చెప్పిన లెనిన్ స్ఫూర్తి ఈనాడు మనకు మరింత అవసరం. అవకాశవాద పోకడలపై పోరాటం, ఆశయాల పట్ల అవగాహన, ఆచరణలో అప్రమత్తత ఇదే లెనిన్ మార్గం. ప్రపంచమనే పద్యానికి ప్రతిపదార్థం లెనిన్ అని శ్రీశ్రీ చెప్పిన మాట యథార్థమని తను రాసిన ఏ పంక్తి చదివినా అర్థమవుతుంది.
(లెనిన్ 155వ జయంతి సందర్భంగా)
– తెలకపల్లి రవి
ప్రపంచానికి ప్రతిపదార్థం లెనిన్
- Advertisement -
RELATED ARTICLES