
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
అమరవీరుల స్ఫూర్తితో కార్మికుల హక్కుల కొరకు పోరాడుదామని కార్మికులోకానికి సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నిజామాబాద్ జిల్లా నాయకులు సారా సురేష్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రం తోపాటు హాస కొత్తూర్ గ్రామాలలో సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ ఆఫీస్ వద్ద మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సారా సురేష్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న హక్కుల రోజు ఇది అన్నారు. బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను నాలుగు కోల్డ్ గా విభజించి కార్మికులకు పని లేకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు.138 సంవత్సరాల క్రితం సాధించుకున్న హక్కుల్ని ప్రభుత్వాలు మారుస్తూ వాళ్ల జీవితాలతోని సెలయేట మాడుతున్నారని ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రావడం కోసం అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని, నల్లధనం బయటకు తీసి ప్రతి ఒక్కరికి రూ.15 లక్షలు పంచుతానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాని అంబానీలకు సేవకుడిగా మారారని విమర్శించారు. పెట్టుబడుదారులకు ఉన్న అప్పులన్నిటిని రద్దు చేశారని, రైతాంగ అప్పుల్ని మాఫీ చేయడం మర్చిపోయారన్నారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న చందంగా మారారని విమర్శించారు. ఈ సందర్భంగా ఐఎఫ్ టియు జెండాలను పార్టీ ఆఫీసు వద్ద సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా మండల కార్యదర్శి బి.అశోక్ ఎగురవేగా, భగత్ సింగ్ విగ్రహం వద్ద ఐఎఫ్టియు మండల అధ్యక్షులు వి.ఆనంద్, హాసకొత్తూర్ లో జిల్లా సహాయ కార్యదర్శి వి.సత్తెమ్మ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ గౌడ్, వి. బాలయ్య, అశోక్, బాలకిషన్, కిషన్ గౌడ్, రాజేశ్వర్, నజీర్, తదితరులు పాల్గొన్నారు.