నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. “తెలుగు ప్రజలంతా కలిసి NTR తరహాలో సుదర్శన్‌రెడ్డిని గెలిపిద్దాం” అని, రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ‘‘జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తమ పార్టీ ప్రతినిధి కాదు. ఆయనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజ్యాంగాన్ని రక్షించాలంటే న్యాయకోవిదుడు అవసరం. చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్, అసదుద్దీన్ తదితర నాయకులు కూడా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించేందుకు మద్దతు ఇవ్వాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అలాగే NDA అభ్యర్థి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని, రిజర్వేషన్లు రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతాయని హెచ్చరించారు. “మహారాష్ట్రలో లక్షలకొద్దీ కొత్త ఓటర్లు నమోదవడం ఆందోళన కలిగించే విషయం” అని అన్నారు. “ఆత్మప్రబోధంతో ఓటు వేయండి. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ప్రతిపాదించారు. ఆయన నిజంగా బీసీల గొంతుక. ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు బలహీన వర్గాలకు ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించాలంటూ సూచనలు చేశారు” అని గుర్తుచేశారు. నామినేషన్ అనంతరం జస్టిస్ సుదర్శన్‌రెడ్డి అందరి సలహాలు తీసుకుని ప్రచారం ముందుకు తీసుకువెళ్తారని సీఎం తెలిపారు.