– ఎస్‌టీఎఫ్‌ఐ మహిళా సదస్సు తీర్మానం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ : మహిళా హక్కులే సామాజిక హక్కులని రాజ్యసభ మాజీ సభ్యులు, ఐద్వా జాతీయ నాయకురాలు మాలిని భట్టాచార్య అన్నారు. ఎస్‌టీఎఫ్‌ఐ రజతోత్సవ మహాసభల సందర్భంగా శనివారం కోల్‌కతాలో ఆ సంఘం జాతీయ నాయకులు బదరున్నీసా అధ్యక్షతన మహిళా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన భట్టాచార్య మాట్లాడుతూ మహిళల హక్కులు కాపాడడం కోసం దేశవ్యాప్త ఉద్యమం జరగాల్సిన అవసరముందని తెలిపారు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, హత్యలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది కోల్‌కతాలో ఆర్జీకార్ మెడికల్ కాలేజీలో డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి, హత్య మహిళలపై దాడుల పరంపరను సూచిస్తోందన్నారు. కోల్‌కతా ఘటన జరిగి సరిగ్గా ఏడాది గడిచినా, బాధిత కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మహిళలను భయభ్రాంతులకు గురి చేయడం, ఇంటికే పరిమితం చేయడం, నిరంతరం మగవారిపై ఆధారపడి ఉండేలా చేయడం లాంటి అనాగరిక భావజాలం భారత సమాజంలో నెలకొన్నదనీ, దానికి మూలం మను ధర్మశాస్త్రంలో ఉన్నదని వివరించారు.ఈ ఆలోచనా విధానం తిరిగి పురివిప్పుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రగతికీ, సమాజాభివృద్ధికి ప్రమాదమని హెచ్చరించారు. సమాజంలోని మహిళలు, శూద్రులను మను ధర్మం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, అణచివేతకు గురి చేసిందనీ, కులాల మధ్య అంతరాలు సృష్టించిందని విశదీకరించారు. ప్రస్తుతం మహిళా శ్రమ శక్తి తగ్గుతున్నదనీ, వారికి ఉద్యోగాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతోందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళలు పురుషుల కన్నా తక్కువ వేతనాలు పొందుతున్నారనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను నిరసిస్తూ సాగిస్తున్న అన్ని రకాల ఉద్యమాల్లో (కార్మిక, రైతాంగ ఉద్యమాలు, ఉద్యోగులు, టీచర్ల ఉద్యమాల్లో) మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. కొంతమంది నాయకులు మహిళలు వేసుకున్న డ్రెస్‌లపై కామెంట్ చేస్తూ వారిని కించపరిచేలా మాట్లాడుతుండటం విచారకరమన్నారు. మహిళలు బయటకు రాకుండా, ఉద్యోగాలు చేయకుండా ఉంటే దాడులు జరగవని చెప్పడం వంటి మనువాద సూత్రాలున్నాయని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ నాయకులు అరుణ కుమారి, చారులత, సిహెచ్. దుర్గ భవాని, శాంతి కుమారి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి కే వెంకట్, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, మహిళ నాయకులు నాగమణి, జ్ఞాన మంజరి, శారద తదితరులు పాల్గొన్నారు.
మహిళా హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES