నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ : ప్రపంచ ఆదివాసీ దినోత్సవమంటే ఒక పండుగ మాత్రమే కాదనీ, అది వారి హక్కుల్ని కాపాడుకునే దీక్షా దినమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కొమురంభీం ఆదివాసీ భవన్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పుచప్పుళ్లతో కొమురంభీం ఆదివాసీ భవన్ హోరెత్తింది. వివిధ గిరిజన తెగలు తమ సంప్రదాయ కళా నృత్య ప్రదర్శనలు ప్రదర్శించాయి. గిరిజన, ఆదివాసీలతో కలిసి బోనమెత్తిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విల్లును ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి యేటా ఆగస్టు 9న జరుపుకుంటారనీ, దీన్ని ధీర దినోత్సవం అని కూడా పిలుస్తారని తెలిపారు. సంస్కృతీ సంప్రదాయాలు సహజ వనరుల పరిరక్షణలో ఆదివాసీల పాత్ర మానవజాతి అందించిన అమూల్యమైన జ్ఞానం వారసత్వాన్ని గుర్తించి గౌరవించడమే ఈ దినోత్సవ లక్ష్యమని చెప్పారు. 1994లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించిందని గుర్తు చేశారు. గిరిజనులు, ఆదివాసీలు తినే సజ్జలు కొర్రలు ఇప్పుడు అన్ని వర్గాల వారూ తింటున్నారని తెలిపారు. ఆదివాసీలు సాగు చేసుకునే భూముల జోలికి వెళ్లొద్దని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారని గుర్తుచేశారు. భూములపై పూర్తి హక్కులు ఉండేలా వారికి పట్టాలు ఇస్తున్నారని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేసి 10 వేల మందితో ఈ కార్యక్రమం చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 32 గిరిజన తెగలున్నాయనీ, జనాభాలో 9.08శాతం మంది షెడ్యూల్డ్ తెగలున్నారని తెలిపారు. ఎస్టీఎస్డీఎఫ్ కింద వారికి రూ.17,168 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యధికమన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు రూ. 6,860 కోట్లు కేటాయించిందన్నారు. అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) కింద ఉన్న భూములకు సోలార్ పంపుల ద్వారా సాగు సౌకర్యం కల్పించామన్నారు. రోడ్ల సౌకర్యంతో పాటు విద్యా, వైద్యం తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వివరించారు. సీతక్క మాట్లాడుతూ ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా మన అస్తిత్వం మర్చిపోవద్దని చెప్పారు. గతంలో గిరిజనులు, ఆదివాసీల తిండి గురించి చాలా మంది తప్పుగా మాట్లాడేవారని గుర్తు చేశారు. పేదోళ్లు వెనుకబడ్డ వాళ్లు తినే తిండి అని హేళన చేసేవారన్నారు. ఇప్పుడు అదే తిండి స్టార్ హోటళ్లలో మెనూలో భాగమయ్యాయని చెప్పారు. దీన్ని బట్టి మన పూర్వీకులు ఆహారపు అలవాట్లు ఎంత గొప్పవో అర్థమవుతుందని వివరించారు. ఎవరైనా గట్టిగా బలంగా ఉండాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో బతకాలని సూచించారు. గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచారని గుర్తుచేశారు. గిరిజన ఆవాసాలకు ప్రభుత్వం సోలార్ పవర్ ఇస్తోందని తెలిపారు. ఆదివాసీలం గిరిజనులం అని చెప్పుకునేందుకు ఎవరూ భయపడొద్దని, జాతిని గురించి గొప్పగా గర్వంగా చెప్పుకోవాలని సూచించారు. గిరిజనులకు, ఆదివాసీలకు చదువు లేదనే స్థాయి నుంచి ఈ సారి ఇంటర్, పది ఫలితాల్లో స్టేట్ ర్యాంకుల స్థాయికి వారు చేరారని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ రాంచంద్ర నాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్లుగా ఎస్ట్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. గిరిజన శాఖను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, ట్రై కార్ చైర్మెన్ బెల్లయ్య నాయక్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ ముత్తినేని వీరయ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి, గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ వి సర్వేశ్వర్ రెడ్డి, ట్రైకర్ జీఎం శంకర్‌రావు, జీటీడబ్య్లూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి కె సీతాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల హక్కుల్ని కాపాడుకుందాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES