Saturday, October 25, 2025
E-PAPER
Homeజాతీయంఅదానీ గ్రూప్‌కు ఎల్‌ఐసీ సొమ్ము: జైరాం రమేష్‌

అదానీ గ్రూప్‌కు ఎల్‌ఐసీ సొమ్ము: జైరాం రమేష్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) 30 కోట్ల రూపాయల పాలసీదారుల పొదుపు మొత్తాన్ని అదానీ గ్రూప్‌కు ప్రయోజనం చేకూర్చడానికి మోడీ ప్రభుత్వం వాటిని ఓ క్రమపద్ధతిలో దుర్వినియోగం చేశారని శనివారం కాంగ్రెస్‌ ఆరోపించింది. అదానీగ్రూప్‌లో పెట్టుబడులు పెట్టమని ఆ గ్రూప్ ఎల్‌ఐసిని ఎందుకు అంత బలవంతం చేసిందో పార్లమెంటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ దర్యాప్తు చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. అయితే కాంగ్రెస్‌ ఈ విషయంపై ఆరోపిస్తున్నప్పటికీ ఇంతవరకూ అదానీ గ్రూప్‌ కానీ.. కేంద్ర ప్రభుత్వంకానీ స్పందించకపోవడం గమనార్హం. దీనిపై శనివారం కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ జైరాం రమేష్‌ మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. మోదానీ జాయింట్‌ వెంచర్‌.. ఎల్‌ఐసిని, ఆ సంస్థలోని పాలసీదారుల పొదుపు 30 కోట్లని క్రమపద్ధతిలో ఎలా దుర్వినియోగం చేశారనే కలవరపెట్టే నిజాలను మీడియా బయటపెట్టింది అని జైరాం రమేష్‌ అన్నారు.

మే 2025లో వివిధ అదానీ గ్రూప్‌ కంపెనీలలో సుమారు 33 వేల కోట్ల ఎల్‌ఐసి నిధులను పెట్టుబడి పెట్టమని భారత అధికారులు ఎల్‌ఐసికి ప్రతిపాదించారని, ఈ ప్రయత్నాన్ని అధికారులు మరింత ముందుకు తీసుకెళ్లారనే విషయాలను తాజాగా అంతర్గత పత్రాలు వెల్లడించాయని జైరాం రమేష్‌ అన్నారు. ఈ వ్యవహారమంతా అదానీ గ్రూప్‌పై విశ్వాసాన్ని కలిగించడం, ఇతర పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యాలని అంతర్గత నివేదికల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. తీవ్రమైన నేరారోపణల కారణంగా నిధుల ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్‌ కంపెనీకి బెయిల్‌ ఇవ్వడం తమ పని అని ఆర్థిక మంత్రిత్వశాఖ, నీతి అయోగ్‌ అధికారులు ఎవరి ఒత్తిడితో నిర్ణయించుకున్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రమేష్‌ ప్రశ్నించారు. ఇది మొబైల్‌ ఫోన్‌ బ్యాంకింగ్‌కి సంబంధించిన టెక్ట్స్‌బుక్‌ కేసు కాదా? అని ప్రశ్నించారు.

గౌతమ్‌ అదానీ, అతని ఏడుగురు సహచరులపై అమెరికాలో నేరారోపణ జరిగిన తర్వాత కేవలం నాలుగు గంటల్లోనే (సెప్టెంబర్‌ 21 – 2024) ట్రేడింగ్‌లో ఎల్‌ఐసి రూ. 7,850 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. ప్రజాధనాన్ని ఆశ్రిత సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే నష్టాలు ఏవిధంగా ఉంటాయో ఈ ఘటనే స్పష్టం చేసింది. భారత్‌లో అధిక ధరలకు సౌర విద్యుత్‌ కాంట్రాక్టులను పొందేందుకు అదానీ రెండు వేల కోట్ల లంచాన్ని అధికారులకు ఆఫర్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై మోడీ ప్రభుత్వం స్పందించలేదు. దాదాపు ఒక సంవత్సరంపాటు ప్రధానిమోడీకి అత్యంత ఇష్టమైన అదాని గ్రూప్‌ సంస్థకు యుఎస్‌ ఎస్‌ఇసి (కోర్టు) సమన్లు జారీ చేయడానికి మోడీ ప్రభుత్వం నిరాకరించింది అని రమేష్‌ విమర్శలు చేశారు.

మోదానీ మెగా స్కామ్‌ చాలా విస్తృతమైనది. ప్రైవేట్‌ కంపెనీలు ఇడి, సిబిఐ, ఐటి వంటి ఏజెన్సీల ద్వారా దాడులు చేయించి.. ఆ కంపెనీల ఆస్తులను అదానీ గ్రూప్‌కు విక్రయించమని బలవంతం చేయడం వంటి ఉదాహరణలెన్నో. అదానీ గ్రూప్‌ ప్రయోజనం కోసమే విమానాశ్రయాలు, ఓడరేవులు వంటి కీలకమైన మౌలిక సదుపాయాల ఆస్తులను మోసపూరితంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని రమేష్‌ ఆరోపించారు. వివధ దేశాలలో, భారత్‌ పొరుగు దేశాలలో అదానీ గ్రూప్‌కు కాంట్రాక్టులను అందించడానికి.. దౌత్య వనరులను సైతం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఎత్తిచూపారు. షెల్‌ కంపెనీల మనీలాండరింగ్‌ నెట్‌వర్క్‌ను ఉపయోగించి అదానీ సన్నిహిత సహచరులు నాసర్‌ అలీ షాబాన్‌ అహ్లీ, చాంగ్‌ – లింగ్‌ ద్వారా మార్కెట్లో ఉన్న ధర కంటే తక్కువ ధరకు బొగ్గును దిగుమతి చేసుకుని.. ఆ తర్వాత విద్యుత్‌ కేంద్రాల నుండి తీసుకున్న విద్యుత్‌ను అధిక ధరలకు అమ్మడం వంటి కుంభకోణాలు కూడా ఈ కోవకే వస్తాయి అని రమేష్‌ ప్రస్తావించారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రలలో అసాధారమైన అధిక ధరలకు కారణం.. ఎన్నికలకు ముందు విద్యుత్‌ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకోవడమేనని రమేష్‌ ఆరోపించారు. త్వరలో బీహార్‌ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అదానీ విద్యుత్‌ ప్లాంట్‌ కోసం భూమిని కేవలం ఒక్క రూపాయికే అప్పగించారని ఆయన ఆరోపించారు. మోదాని మెగా స్కామ్‌ మొత్తాన్ని పార్లమెంటు సంయుక్త పార్లమెంటు కమిటీ దర్యాప్తు చేయాలని కాంగ్రెస్‌ గత మూడు సంవత్సరాలుగా డిమాండ్‌ చేస్తోంది. ఈ సిరీస్‌పై సిరీస్‌ హమ్‌ అదానీ కే హై కౌన్‌ (హెచ్‌ఎహెచ్‌కె)తో వంద ప్రశ్నలతో కూడిన పత్రాన్ని కూడా ప్రచురించాము. మొదటగా.. ఇప్పుడు అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి పెట్టుబడులు పెట్టడానికి ఎలా బలవంతం చేసిందనే దానిపై పార్లమెంటు పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ దర్యాప్తు చేయాలి. ఈ వ్యవహారంపై స్వతంతంగా అధికారాల్ని ఉపయోగించి దర్యాప్తు చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు కాంగ్రెస్‌ నేత రమేష్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -