నవతెలంగాణ హైదరాబాద్: వేసవి వచ్చిందంటే చాలు కోల్డ్ డ్రింక్స్ డిమాండ్ ఆకాశాన్ని అంటుతుంది. మార్కెట్లో చాలా పెద్ద పెద్ద కోల్డ్ డ్రింక్ బ్రాండ్లు ఉన్నా, తాజాగా కోకా-కోలా ఇండియాకు చెందిన నిమ్మకాయ రుచి గల లిమ్కా (Limca) అద్భుతమైన రికార్డు సృష్టించింది. 2024 సంవత్సరంలో లిమ్కా రూ.2,800 కోట్ల ఆదాయాన్ని సాధించి, ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుతమైన విజయంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల వినియోగదారులు తెగ తాగేశారు.
లిమ్కా జోరు!
50 ఏండ్లకు పైగా చరిత్ర ఉన్న లిమ్కా బ్రాండ్ ను 1971లో స్థాపించారు. కోకా-కోలా ఇండియా ఒక ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ, పంజాబ్, హర్యానా వంటి అనేక ముఖ్యమైన రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ గ్రోత్ (రెండంకెల వృద్ధిని) లిమ్కా నమోదు చేస్తోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా లిమ్కాకు నిరంతరం పెరుగుతున్న ప్రజాదరణే ఈ విజయానికి కారణం. ప్రస్తుతం కోకా-కోలా భారతీయ పోర్ట్‌ఫోలియోలో థమ్స్ అప్, స్ప్రైట్, మాజా వంటి మూడు బ్రాండ్లు ఉన్నాయి, వీటిలో ప్రతి ఒక్కటి ఒక బిలియన్ డాలర్ల (దాదాపు ₹8,300 కోట్లు) కంటే ఎక్కువ ఆదాయాన్ని సాధిస్తున్నాయి. 1993లో కోకా-కోలా, మాజా, థమ్స్ అప్, లిమ్కా వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ బ్రాండ్లు భారత మార్కెట్లో మరింత బలపడ్డాయి.
కొత్త చరిత్ర సృష్టిస్తున్న కోకా–కోలా ఇండియా
కోకా-కోలా ఇండియా ఉన్నతాధికారి వినయ్ నాయర్ మాటల్లో లిమ్కా విజయం గురించి మీడియా నివేదికలు స్పష్టం చేశాయి. లిమ్కా విజయ గాథ పట్టుదల, నిరంతర కొత్తదనం, బెస్ట్ క్వాలిటీ కోసం చేసిన ప్రయత్నాలకు నిదర్శనం అని ఆయన అన్నారు. 1993లో కోకా-కోలా తిరిగి భారత మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు, రమేష్ చౌహాన్ నాయకత్వంలోని పార్లే బిస్లరీ (Parle Bisleri) నుంచి గోల్డ్ స్పాట్ (Gold Spot)తో సహా మొత్తం కార్బోనేటెడ్ డ్రింక్స్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు.
కోకా-కోలా విజయానికి అసలు కారణం వినియోగదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం, పట్టణాలు, పల్లెల్లో తమ పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడం, ఆకర్షణీయమైన మార్కెటింగ్ ప్రచారాలు (క్యాంపెయిన్లు) చేపట్టడం ఈ వ్యూహంలో ముఖ్యమైన అంశాలు. 2024 సంవత్సరంలో, కోకా-కోలా హైడ్రేషన్ విభాగంలో లిమ్కా బ్రాండ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు లిమ్కా గ్లూకోఛార్జ్ (Limca Glucocharge) ను విడుదల చేసింది. ఇది గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు కలిగిన ఒక ప్రత్యేకమైన పానీయం. దీని ప్రచారానికి ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాను ఉపయోగించారు.
భారతదేశంలో కోకా-కోలా అందించే పానీయాల విస్తృత శ్రేణిలో కోకా-కోలా, డైట్ కోక్, థమ్స్ అప్, ఫాంటా, లిమ్కా, స్ప్రైట్, మాజా, మినిట్ మెయిడ్ జ్యూస్‌లు, ఆనెస్ట్ టీ (Honest Tea) వంటివి ఉన్నాయి. ఇవి వినియోగదారుల వివిధ అవసరాలను తీరుస్తాయి. లిమ్కా నిరంతరం సాధిస్తున్న ఈ పెరుగుతున్న ప్రజాదరణ, భారత మార్కెట్లో కోకా-కోలాకు ఉన్న బలమైన పట్టును మరింత పటిష్టం చేసింది.