నవతెలంగాణ -జన్నారం
స్థానిక సంస్థల ఎన్నికలు మరో నెల రోజులు ఆపాలని బీసీ సంక్షేమ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య అన్నారు. ఆదివారం జన్నారంలో పత్రికా విలేకరులతో మాట్లాడారు. గవర్నర్ కి పంపిన బిల్లులు మూడు నెలలు గడిస్తే అవి ఆమోదం పొందినట్లు అవుతుందన్నారు. ఆ బిల్లుల ప్రకారంగా ఎన్నికలు నిర్వహించవచ్చు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పట్టుదలతో ఉన్న పక్షంలో అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకునే గడువు వరకు వేచి ఉంటే బాగుంటుందనీ అధికార పార్టీ నేతలు చెబుతున్న విధంగా పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్లు మూడు నెలల్లోగా తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే అవి ఆమోదం పొందినట్లు భావించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పిన విషయం తెలిసిందే అన్నారు.
మొదటి రెండు పర్యాయాలు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఆర్డినెన్స్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% పరిమితికి మించి రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. మరో 25 రోజులైతే ఆ బిల్లును పంపి 90 రోజులు అవుతుంది. అందువల్ల దీనితోపాటు సుప్రీంకోర్టు, రాష్ట్రపతి నుంచి వచ్చే స్పందనల కోసం మరో నెల వేచి చూస్తే బాగుంటుందని ఈ సందర్భంగా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తరఫున కోరుతున్నామనీ అన్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి ఆగిన స్థానిక సంస్థల ఎన్నికలు మరొక నెల రోజులు ఆగగానే నష్టపోయేది ఏమీ లేదన్నారు. బీసీ కులాల వారికి రిజర్వేషన్లలో న్యాయం జరగాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్లు అమలు కావలసిన అవసరం ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో- కన్వీనర్ కడార్ల నరసయ్య , బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ శ్రీరాముల కొండయ్య , ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం , మహేంద్ర సంఘం జన్నారం మండల నాయకుడు కోడిజుట్టు రాజయ్య , జన్నారం మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.