No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంలోకల్‌ స్కూల్‌...గ్లోబల్‌ ఫీజ్‌

లోకల్‌ స్కూల్‌…గ్లోబల్‌ ఫీజ్‌

- Advertisement -

కార్పొరేట్ల విద్యాదందా ప్రపంచ నగరాలతో సమానంగా ఫీజుల వసూళ్లు
– ఢిల్లీలో 130 శాతం ఖర్చు.. సింగపూర్‌లో 30 శాతమే..!
-ఫీజులకు ప్రమాణాలకు భారీ అంతరం
– తల్లిదండ్రులపై పెను ఆర్థిక భారం


భారత్‌లో విద్య వ్యాపారంగా మారింది. కార్పొరేట్‌ శక్తుల ప్రవేశంతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పలు బడా ప్రయివేటు స్కూళ్లలో ఫీజులు షాక్‌ను కలిగిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ వార్షికాదాయానికి మించి మరీ ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలోని పలు ప్రముఖ నగరాలు సింగపూర్‌, దుబారు, న్యూయార్క్‌ల్లో అక్కడి స్కూళ్ల ఫీజులతో సమానంగా ఇక్కడి ఫీజులు ఉంటున్నాయి. ఇందుకు తగ్గట్టుగా భారతీయ తల్లిండ్రులు జీతాలు ఉంటున్నాయా అంటే అదీ లేదు. అలాగే రూ.లక్షల్లో ఫీజులు కట్టినా పిల్లలకు మాత్రం అందుకు తగిన విద్యా ప్రమాణాలు, మౌలిక సౌకర్యాలు అందటం లేదు. దీంతో ప్రయివేటు పాఠశాలలపై నియంత్రణ ఉండాలని విద్యారంగ నిపుణులు, విద్యావేత్తలు సూచిస్తున్నారు.

న్యూఢిల్లీ : భారత్‌లోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ మాత్రమే కాదు.. పలు ద్వితీయ శ్రేణి నగరాల్లోని టాప్‌ స్కూళ్లలో ఫీజులు షాక్‌ను కలిగించే విధంగా ఉంటున్నాయి. అగ్రశ్రేణిగా చెప్తున్న కొన్ని ప్రయివేటు పాఠశాలలు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నాయి. అయితే ఇంత భారీ మొత్తంలో ఫీజులను చూసి తల్లిదండ్రులు, మేధావులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐవీ లీగ్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ ట్యూషన్‌ లేదా యూరప్‌లోని ఇంటర్నేషనల్‌ బోర్డింగ్‌ స్కూల్‌తో సమానంగా ఇక్కడి ఫీజులు ఉంటున్నాయని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచస్థాయి నగరాల్లో ఇలా..
సింగపూర్‌, దుబారు, లండన్‌, న్యూయార్క్‌ వంటి అత్యంత సంపన్న నగరాల్లో ఉండే తల్లిదండ్రులు కూడా వారి పిల్లల చదువుల కోసం ఇంత మొత్తంలోనే ఫీజులు చెల్లిస్తున్నారు. ఆశ్యర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నగరాల్లో ఉంటున్న వీరి జీతాలు భారతీయులతో పోలిస్తే మూడు నుంచి ఐదు రెట్లు అధికం. అలాగే తమ వార్షికాదాయంలో పిల్లల చదువు కోసం ఖర్చు చేసేది కూడా భారతీయులతో పోల్చుకుంటే తక్కువే. భారత్‌లోని తల్లిదండ్రుల జీతాలు అంతర్జాతీయ స్థాయిలో స్కూల్‌ ఫీజులను భరించేంత లేకున్నా.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మాత్రం వారిని ఆ వైపుగా తీసుకెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యను వ్యాపారమయంగా మార్చిన కార్పొరేటు శక్తులు, వాటిని నియంత్రించలేని ప్రభుత్వాలదేననే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

ఆదాయంలో 50 నుంచి130 శాతం ఫీజులకే
విదేశీ నగరాలతో పోలిస్తే భారత్‌లోని ప్రధాన నగరాల్లో తల్లిదండ్రుల సంపాదన, వారు చెల్లించే ఫీజుల్లో భారీ తేడాలున్నాయి. భారత్‌లో తల్లిండ్రులు తమ వార్షిక సంపాదనలో అత్యధికంగా 50 శాతం నుంచి 130 శాతం వరకు తమ పిల్లల స్కూల్‌ ఫీజులకే ఖర్చు చేస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో వార్షికాదాయాలను మించి ఉంటున్నాయన్నమాట. సింగపూర్‌, దుబారు, లండన్‌, న్యూయార్క్‌ వంటి నగరాల్లో మాత్రం తల్లిదండ్రులు తమ వార్షికాదాయంలో 30 శాతం నుంచి 60 శాతం మధ్య ఖర్చు చేస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీలో ఒక ఇంటి సగటు వార్షికాదాయం రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలుగా ఉంటుంది. అయితే టాప్‌ ప్రయివేటు లేదా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో తమ పిల్లల ఫీజులకు తల్లిదండ్రులు రూ.12 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య చెల్లిస్తున్నారు. అంటే తల్లిదండ్రులు తమ వార్షికాదాయంలో 80 నుంచి 130 శాతం ఫీజులకే ఖర్చు చేస్తున్నారు. వీటికితోడు యూనిఫాంలు, పుస్తకాలు, బస్సు ఫీజు, టెక్‌ యాప్‌లు, విహారయాత్రలు, స్కూళ్లలో పిల్లల కోసం నిర్వహించే ఇతర కార్యక్రమాలకు చేసే ఖర్చుతో కలుపుకుంటే ఈ ఖర్చు రూ.లక్ష నుంచి రూ. 3 లక్షలు అదనంగా ఉంటుంది. ఇక ముంబయిలో పిల్లల ఫీజులకు తల్లిదండ్రులు చేసే ఖర్చు 50-85 శాతంగా ఉంది.

విదేశాల్లోని నగరాల్లో ఇదీ పరిస్థితి
సింగపూర్‌లో ఒక ఇంటి సగటు వార్షికాదాయం రూ.72 లక్షలు. పిల్లల స్కూల్‌ ఫీజుకు అయ్యేది రూ.24 లక్షలు. అంటే తమకొచ్చే ఆదాయంలో చేస్తున్న వ్యయం 33 శాతమే. దుబారులో 30 శాతం, లండన్‌లో 58 శాతం, న్యూయార్క్‌లో 50 శాతం చొప్పున పిల్లల స్కూల్‌ ఫీజుల కోసం ఖర్చు చేస్తున్నారు. అలాంటి అంతర్జాతీయ నగరాల కంటే భారత్‌లోని తల్లిదండ్రులు తమ ఆదాయంలో ఫీజులకు చేసే ఖర్చు రెట్టింపు ఉండటం గమనార్హం.

చదువు అంతంత మాత్రమే
భారత్‌లో అంతర్జాతీయ ఫీజులతో సమానంగానే ఫీజులు చెల్లిస్తున్నా స్కూళ్లలో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఒక తరగతి గదిలో సగటున 35 నుంచి 40 మంది విద్యార్థులు ఉంటారు. ఇక స్విమింగ్‌పూల్స్‌, ల్యాబ్‌లు, ఆడిటోరియాలు వంటివి ఉన్నప్పటికీ వాటిని పరిమితికి మించిన సంఖ్యలో విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అని ఊదరగొట్టినా అక్కడి ఉపాధ్యాయుల శిక్షణ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అదే విదేశాల్లోని అనేక ఇంటర్నేషనల్‌ స్కూళ్లలో ఒక తరగతి గదిలో 15-20 మంది విద్యార్థులను మాత్రమే పరిమితం చేస్తారు. ఫీజులకు తగినట్టుగా సదుపాయాలు, ప్రమాణాలు విద్యార్థులకు అందుతాయి.

ప్రభుత్వాలు నియంత్రించాలి
భారత్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్లపై ప్రభుత్వాల నియంత్రణ లేకపోవటమే ఈ దుస్థితికి కారణమని విద్యావేత్తలు చెప్తున్నారు. ఫీజుల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఇతర దేశాల్లో అయితే విద్య, స్కూళ్లపై అక్కడి ప్రభుత్వాల నియంత్రణ ఉంటుందని చెప్తున్నారు. ఫీజుల పెంపు విషయంలో అక్కడి స్కూళ్లు ప్రభుత్వాల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్య అనేది ప్రయివేటు చేతుల్లో వెళ్తే ఎంతో ప్రమాదమో తాజా పరిస్థితులు సూచిస్తున్నాయని వారు చెప్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad