నవతెలంగాణ-హైదరాబాద్: మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టానికి బదులుగా వీబీజీ రామ్ జి చట్టాన్ని కేంద్రం తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఈ నిరసనల్లో భాగంగా చేపట్టిన ‘లోక్‌భవన్ ఛలో’ ముట్టడి కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె శివకుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. ‘నేడు కెపీసీసీ (కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) పిలుపు మేరకు మేము రాష్ట్రవ్యాప్తంగా నిరసన నిర్వహించాము. ఈ నిరసనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కోర్టు ఉత్తర్వు ఉన్నందున మేము నిరసన ర్యాలీ నిర్వహించలేదు. అందుకే మేము రెండు బస్సుల్లో వచ్చి రాజ్‌భవన్‌ని ముట్టడించాము.
కేంద్రం ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ చట్టానికి బదులు వీబీజీ రామ్‌జి చట్టాన్ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన చేపట్టాం.వీబీజిరామ్ జీ ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని వారు తీసుకుంటున్నారు. ఈ వీబీజీ రామ్‌జితో కేంద్రమే ప్రతిదీ నిర్ణయిస్తుంది. రాబోయే రోజుల్లో కర్ణాటక అంతటా ఈ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన ఆందోళనల్ని తీవ్రతరం చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మేము నిరసనల్ని చేపడతాం. విబిజి రామ్ జిని వెనక్కి తీసుకుని.. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎను తిరిగి తీసుకురావాలి. అప్పటివరకూ మేము మా పోరాటాన్ని కొనసాగిస్తాము. ప్రజా మద్దతు కూడగట్టడానికి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పార్టీ పాదయాత్రలు చేపడుతుంది’ అని ఆయన అన్నారు.


