నవతెలంగాణ-హైదరాబాద్: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ ద్వారాలు మూతపడ్డాయి. ఆదివారం నాడు ఏకాంత సేవ ముగిసిన వెంటనే, ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఆలయానికి తాళాలు వేశారు. సన్నిధి గొల్ల బంగారు వాకిలికి తాళం వేయడంతో ఆలయ మూసివేత ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రభావంతో సుమారు 12 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. అనంతరం ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి నిర్వహించే నిత్య సేవలను ఏకాంతంగా పూర్తి చేసి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను సోమవారం వేకువజామున 2 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని ఇతర ఉప ఆలయాలను కూడా మూసివేశారు. అంతేకాకుండా, భక్తులకు నిరంతరం సేవలు అందించే లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, అన్నప్రసాద కేంద్రాలను కూడా గ్రహణం ముగిసే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
గ్రహణం కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. సుమారు 50 వేల పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచింది. కాగా, ఆదివారం శ్రీవారిని 27,525 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.