నవతెలంగాణ-హైదరాబాద్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ జిల్లాకు చెందిన మనోహర్ లాల్ ధాకడ్ అనే వ్యక్తి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఆయన రాత్రి ఢిల్లీ-ముంబై 8-లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ మహిళతో కలిసి అసభ్యకర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో. అదికాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. దీనితో వెంటనే అది వైరల్ కావడంతో వివాదం రేగింది. వివాదాస్పద వీడియోలో ధాకడ్ ఒక తెల్ల బాలెనో కారు (MP14CC4782) వద్ద మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపించింది. కారు నంబర్ ఆధారంగా ఆ వాహనం మనోహర్ లాల్ ధాకడ్ పేరుతోనే నమోదు అయిందని గుర్తించారు అధికారులు. వీడియో వైరల్ అయిన తరువాత ధాకడ్ తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
అయితే, ఈ ఘటనపై మందసౌర్ జిల్లా భాన్‌పురా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆయనపై 296, 285, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా అతనితో ఉన్న మహిళను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా, ఈ వివాదంపై బీజేపీ కూడా స్పందించింది. మనోహర్ లాల్ ధాకడ్ పార్టీకి చెందినవాడన్న ప్రచారాన్ని ఖండించారు. మందసౌర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ మాట్లాడుతూ.. ధాకడ్ బీజేపీ నేత కాదు. ఆయన కేవలం ఆన్‌లైన్ ద్వారా సభ్యత్వం తీసుకున్నవాడై ఉండవచ్చు.. కానీ, ఆయనకు ఎటువంటి పదవి లేదని స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉండగా.. మనోహర్ లాల్ ధాకడ్ భార్య మాత్రం బీజేపీ మద్దతుతో జిల్లా పంచాయతీ 8వ వార్డుకు ఎన్నికైన సభ్యురాలు అని సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయనపై పార్టీ పరంగా స్పష్టమైన దూరం పాటిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో ధాకడ్ మహాసభ యువ సంఘం కూడా స్పందించింది. సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న మనోహర్ లాల్ ధాకడ్‌ను తక్షణమే పదవి నుండి తొలగించినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అర్జున్ ధాకడ్ తీసుకున్నారు. ఈ వివాదం తమ సంస్థను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ధాకడ్ సంబంధించిన సమాచారం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.