నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరులకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. మందకృష్ణ మాదిగ నేతృత్వంలో 1994 లో ప్రారంభమైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఉద్యమంలో అమరులైన మాదిగ జాతి బిడ్డలను స్మరించుకుంటూ మార్చి 1 ను అమరుల దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందన్నారు.
మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో అమరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. వారి మరణాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారు కలలు కన్న ఆశయ సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి బట్ట వెంకట్ రాములు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు మాదిగ సమాజానికి పునర్జన్మలాంటివని, వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఉద్యమం ద్వారా సాధించాల్సిన లక్ష్యాలను చేరుకునే వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తి లక్ష్మి, కొత్త ల. యాదగిరి, ధ్యామని భూపతి, కొత్తూరు సాయిలు, శైలజ, రేణుక, వాసు తదితరులు పాల్గొన్నారు.


