Sunday, May 11, 2025
Homeరిపోర్టర్స్ డైరీమహామంత్రి.. విస్తరాకులు…

మహామంత్రి.. విస్తరాకులు…

- Advertisement -

అనగనగా ఒక రాజు.. హాయిగా, ఆనందంగా పరిపాలన సాగిస్తున్న ఆయనకు ఓ సారి పెద్ద చిక్కొచ్చి పడింది. ఓ శత్రు దేశం కయ్యానికి కాలు దువ్వింది. అర్థరాత్రి చడీ చప్పుడు కాకుండా దండెత్తింది. దీంతో ఖిన్నుడైన ఈ రాజు… అప్పటికప్పుడు సర్వ సైన్యాధ్యక్షుడిని పిలిచాడు. యుద్ధ వ్యూహం పన్నాలని ఆదేశించారు. అశ్వ, గజ, పదాతి దళాల పరిస్థితి ఏంటి? వాటిలో ఎంత మంది సుశిక్షుతులై ఉన్నారంటూ ప్రశ్నించా రు. దానికి సైన్యాధ్యక్షుడు మౌనం దాల్చాడు. ఎందుకంత మౌనమంటూ రాజు ప్రశ్నించగా… ‘రాజా…మన దగ్గర అన్ని దళాల్లో కలిపి కేవలం పది వేల మంది సైన్యం మాత్రమే ఉంది. కానీ శత్రు దేశ సైన్యం ఇరవై వేలకు మించి ఉంది, దాన్ని తట్టుకోవటం కష్టం…’ అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అప్పుడు రాజుకు ఏం చేయాలో పాలుపోలేదు. కొద్ది సేపటి తర్వాత మహామంత్రిని పిలవాలంటూ ఆయన భటులను ఆదేశించారు. ఆ అర్థరాత్రి పూట మాంచి నిద్రలో ఉన్న మహామంత్రి కళ్లు నులుముకుంటూ రాజ ప్రసాదానికి చేరుకు న్నారు. విషయం తెలుసుకుని… ‘ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు ప్రభూ… యాభై వేల విస్తరాకులు తీసుకురండి.. మిగతా కథ నేను నడిపిస్తాను…’ అని చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం యాభై వేల విస్తరాకులను తెప్పించారు. మహామంత్రి వాటన్నింటినీ వరసగా పేర్చి… ఒక్కో విస్తరాకుకు కొంత అన్నం, కొంత సాంబారు, కొంత మజ్జిగ పూయమని చెప్పాడు. ఆ విధంగా పూసిన ఆకులను శత్రు సైన్యాలు బస చేసిన ప్రాంతానికి కొద్ది దూరంలో వేసి రావా లంటూ భటులను ఆదేశించాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటూ మహారాజు అడగ్గా…’ఏం లేదు రాజా…మన దగ్గర పది వేల సైన్యం మాత్రమే ఉంది, ఆ విషయం మనకు మాత్రమే తెలుసు. శత్రు దేశ రాజుకు, అక్కడి సైన్యానికి ఈ విషయం తెలియదు. అందువల్ల మన దగ్గర యాభై వేల సైన్యం ఉన్నట్టు నటించాలి, అందుకే ఈ విస్తరాకుల యవ్వారం నడిపా. వాటిని చూసి.. అమ్మో… ఇంత మంది సైనికులు ఉన్నారా…? అంటూ ఎదుటి దేశం, మనల్ని చూసి భయపడుతుంది. దాంతో మనం సగం విజయం సాధించినట్టే.. ఎప్పుడైనా మన బలహీనతల గురించి మనం లోపల చర్చించుకోవాలి తప్ప బయట పెట్టకూడదు. ఎదుటి వాడికి ఆ విషయం తెలియనివ్వ కూడదు… అదీ రాజనీతి… విపత్కర, సంక్లిష్ట పరిస్థితుల్లో ఎలా పాలన చేయాలో తెలిసిన వాడే విజయం సాధిస్తాడు…’ అంటూ మహామంత్రి ముగించాడు. ఇలాంటి కథలను నేటి మన పాలకులు చదివి తీరాలంటున్నారు ఆర్థికశాఖలోని కొందరు అధికారులు. అంతేతప్ప… ‘మా దగ్గర డబ్బుల్లేవు, నేనేమీ చేయలేను.. నా వల్ల కాదు.. అంటూ కూర్చుంటే ప్రజలేం కావాలి… అలాంటప్పుడు గద్దె మీద మీరెందుకు కూర్చో వాలి…’ అని ప్రశ్నిస్తున్నారు సదరు ఆఫీసర్లు. ఈ కథంతా ఎవరి కోసమో.. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుందిగా…
-బి.వి.యన్‌.పద్మరాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -