Tuesday, February 24, 2026
E-PAPER
Homeజాతీయంఏపీ అసెంబ్లీలో తిరుమ‌ల ల‌డ్డూపై ప్రధాన చర్చ

ఏపీ అసెంబ్లీలో తిరుమ‌ల ల‌డ్డూపై ప్రధాన చర్చ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రధాన చర్చా అంశంగా నిలిచింది. మంగళవారం అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ప్రసంగిస్తూ … 2019 నుండి టీటీడీలో నెయ్యి సరఫరా, లడ్డూ తయారీ వ్యవస్థలలో లోపాలు జరిగాయని అన్నారు. ఈ సమావేశంలో పవర్‌ పాయింట్‌ స్లైడ్స్‌ ద్వారా లడ్డూ కల్తీ, నెయ్యి నాణ్యత సమస్యలపై వివరణ ఇచ్చారు. చంద్రబాబు మాట్లాడుతూ …. వెంకటేశ్వర స్వామి దైవంపై జరిగిన అన్యాయం పట్ల తాము ఆవేదనతో ఉన్నామని, టీటీడీ వ్యవస్థలో నిబంధనలు బదిలీ చేయక, నెయ్యి నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కల్తీ జరిగిందని తెలిపారు. రూ.20.01 కోట్ల విలువ గల లడ్డూలు కల్తీ నెయ్యితో తయారై విక్రయించారని, దీనికి రూ.234 కోట్లు ఖర్చు చెల్లించారన్నారు. గత టీటీడీ బోర్డు నిబంధనలను సరిగ్గా పాటించక, టెండర్లు మేకింగ్‌లో లోపాలు చేసిందని చెప్పారు.

సిబిఐ ఆధ్వర్యంలో సిట్‌ దర్యాప్తు, రిపోర్టులు, నెయ్యి శాంపిల్స్‌ పరిశీలనల ద్వారా కల్తీ జరిగిందని తేలిందన్నారు. 2022లో కూడా ఈ విషయంపై వచ్చిన నివేదికలను అప్పటి అధికారులు పట్టించుకోలేదని ముఖ్యమంత్రి తెలిపారు. వైసిపి హయాంలో దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. అడిగితే కేసులు పెట్టారని అన్నారు. తమ కులదైవం వేంకటేశ్వర స్వామి అని చెప్పారు. ఆయన తనను ప్రమాదం నుంచి కాపాడారని గుర్తు చేశారు. తాను సిఎం కాగానే ముందుగా టీటీడీ ప్రక్షాళన చేశానని తెలిపారు. బ్రిటిషు వాళ్లు కూడా వెంకటేశ్వరుల స్వామి జోలికి వెళ్లలేదు… కానీ గత పాలకులు క్షమించరాని పాపం చేశారు అని, దైవ క్షేత్రంలో ఈ మహాపాపం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ చర్చలో ఎపి డిప్యూటీ సిఎం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ …. వైసీపీ హయాంలో శ్రీవారి ప్రసాదం కల్తీ అయ్యిందని ఆరోపించారు. నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని నివేదికలు స్పష్టంగా తెలిపాయని అన్నారు. కల్తీ జరిగిందని వైసీపీ ఒప్పుకుంటే ఇంత చర్చ అవసరం లేదు. కానీ కల్తీ జరగలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వస్తుందన్నారు. లడ్డూ కల్తీపై దీక్ష చేశాననీ, వైసీపీ హయాంలో హిందూ దేవాలయాలపై దాడులు చేసినా తాము వారిపై ఆరోపణలు చేయలేదని పవన్‌ వ్యాఖ్యానించారు.

అన్ని ఆధారాలు ఉన్నా వైసీపీ ఇలా ఎందుకు చేస్తుందనీ, వివరణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని జగన్‌ చెబితే సరిపోయేది. కానీ ఇలాంటి నాటకాల వల్ల పెద్ద తప్పు జరుగుతుంది అని చెప్పారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని తాము అనలేదు అని, తప్పు అప్పటి టీటీడీ బోర్డు చేసింది అని చెప్పారు. ఆ టీటీడీ బోర్డును జగన్‌ ఎందుకు వెనక వేసుకుని వస్తున్నారు అర్థం కాలేదు అని అడిగారు. నచ్చిన సంస్థకు టెండర్లు అప్పగించాలని రూల్స్‌ అన్ని బ్రేక్‌ చేశారనీ, ఈ అంశంలో దోషులకు శిక్ష పడాల్సిందే అన్నారు డిప్యూటీ సీఎం పవన్‌. అన్ని మతాలను గౌరవించడం ఈ దేశ మూల సిద్ధాంతం అని పవన్‌ చెప్పారు. ఇలాంటి తప్పు మరో మతంలో జరిగితే గగ్గోలు పెట్టేవారని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఇలా చేయడం దారుణమన్నారు. ఆ భగవంతుడి డబ్బుతో ఆడుకున్న వారి తలలు లేచిపోతాయని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -