నవతెలంగాణ - హైదరాబాద్: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం, అమెరికా వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు పెరగడంతో మదుపర్లు పసిడి, వెండి నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో దేశీయ మార్కెట్లోనూ ధరలు దిగివచ్చాయి. గురువారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,350కు చేరింది. గత రోజుతో పోలిస్తే సుమారు రూ.1,400 తగ్గింది. ఇక కిలో వెండి ధర రూ.1,86,550 పలికింది. ఒక్కరోజులోనే వెండి ధర రూ.3 వేలకు పైగా తగ్గడం గమనార్హం.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ 19 నెలల గరిష్ఠానికి చేరడం కూడా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది. డాలర్ బలపడటంతో ఇతర దేశాల కరెన్సీల్లో ఈ లోహాల కొనుగోలు ఖరీదుగా మారి డిమాండ్ తగ్గుతోంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లు పెంచవచ్చన్న అంచనాలు ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి.






కామెంట్‌లు (0)