Monday, May 12, 2025
Homeట్రెండింగ్ న్యూస్సరస్వతీ పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి

సరస్వతీ పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి

- Advertisement -

– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
– కాళేశ్వరంలో పనుల పరిశీలన
– దేవాదాయ శాఖ అధికారులకు వార్నింగ్‌
నవతెలంగాణ-కాళేశ్వరం

సరస్వవతీ నది పుష్కరాల్లో నాణ్యత పాటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదివారం జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో వీఐపీ ఘాట్‌, సరస్వతీ మాతా విగ్రహం, జ్ఞానతీర్థం, నదిలో భక్తుల స్నానమాచరించే ప్రదేశం, టెంట్‌ సిటీ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం టెంట్‌ సిటీలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి రాక సందర్భంగా బందోబస్తు, పనులు పూర్తి చేయాల్సిన అంశాలపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని, నాణ్యతతో వేగంగా పూర్తిచేయాలని తెలిపారు. పట్టణం మొత్తాన్ని విద్యుద్ధీకరణతో ముస్తాబు చేయాలని 12 రోజులు పండుగ వాతావరణం కనిపించాలని సూచించారు. సరస్వతీ మాత విగ్రహాన్ని పూలతో అందంగా అలంకరణ చేయాలన్నారు. పిండ ప్రధాన భవనం అసంపూర్తిగా ఉందంటూ దేవాదాయ ఇంజినీరింగ్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హారతి కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు నదిలోకి వెళ్లకుండా బారికేడ్స్‌, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. నది వద్ద 50మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచడంతోపాటు నాటుపడవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. పుష్కరాల సందర్భంగా మొట్టమొదటిసారిగా కాళేశ్వరంలో టెంట్‌ సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం వస్తున్నారని, అలాగే తదుపరి రోజుల్లో గవర్నర్‌, మంత్రులు వచ్చే ఆవకాశం ఉన్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. మహదేవపూర్‌ నుంచి వీధిదీపాలు ఏర్పాటుతో పాటు డివైడర్లు మధ్యలో స్ట్రిప్‌ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారులకు మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. తాత్కాలిక బస్టాండ్‌ వద్ద తాత్కాలిక లైటింగ్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణం మొత్తం పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. ఒక్క నిమిషం కూడా కరెంటు పోవద్దని కాటారం, బీరసాగర్‌ నుంచి విద్యుత్‌ సరఫరా తీసుకోవాలని తెలిపారు. దేవాలయం, 100 గదుల సత్రంలో జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెయిన్‌ ఘాట్‌ వద్ద ఆర్చి స్లాబు వేశారని, పుష్కరాలు దగ్గర పడుతున్న సమయంలో ఎందుకు స్లాబు వేశారని, పని ఎలా అయిపోతుందో చెప్పాలంటూ దేవస్థానం ఇంజినీరింగ్‌ అధికారులను ప్రశ్నించారు. ట్రాఫిక్‌ ప్లాన్‌ పక్కగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, దేవాదాయశాఖ కమిషనర్‌ వెంకటరావు, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, ఎస్పీ కిరణ్‌ ఖరే, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌ సింగ్‌, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -