నవతెలంగాణ-హైదరాబాద్ : ఫిలిప్పీన్స్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. దేశంలోని మధ్య ప్రాంతంలో ఉన్న సెబూ ప్రావిన్స్‌లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ (PHIVOLCS – ఫివోల్క్స్) నివేదిక ప్రకారం.. ఈ భూకంపం మధ్యాహ్నం సుమారు 3:22 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సంభవించింది. భూకంప కేంద్రం సెబూ ప్రావిన్స్‌లోని బోగో సిటీకి ఆగ్నేయంగా 17 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.
ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే, కొన్ని పాత భవనాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని స్పష్టం చేసినప్పటికీ, ఆఫ్టర్ షాక్స్ (తదుపరి ప్రకంపనలు) వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ‘ఫివోల్క్స్’ హెచ్చరించింది.



