Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంటాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వెళ్తున్న టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ (18189) గత అర్ధరాత్రి అగ్నిప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒక వృద్ధుడు సజీవ దహనం కాగా, వందలాది మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. రైలు విశాఖ జిల్లా దువ్వాడ దాటిన తర్వాత ఎలమంచిలి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలు వేగాన్ని అందుకుంటున్న క్రమంలో నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేకులు పట్టేయడంతో ఘర్షణ జరిగి నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో ఆ మంటలు పక్కనే ఉన్న ఎం2 బోగీకి కూడా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచిలి స్టేషన్‌లో రైలును నిలిపివేసే లోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

మంటలు, దట్టమైన పొగతో బోగీల నిండా కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో తలుపులు తన్నుకుంటూ బయటకు పరుగులు తీశారు. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చేసరికి రెండు బోగీలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ క్రమంలోనే బీ1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. మృతుడిని విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ సుందర్‌గా గుర్తించారు.

ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సుమారు 2వేల మంది ప్రయాణికులు చలిలో స్టేషన్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు అంబులెన్స్‌లను రప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాలిపోయిన బోగీలను వేరుచేసి, మిగిలిన ప్రయాణికులను బస్సులు, ఇతర బోగీల ద్వారా గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనతో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -