Wednesday, May 7, 2025
Homeరాష్ట్రీయంమెరుగైన వేతన ఒప్పందానికి సీఐటీయూనే గెలిపించండి

మెరుగైన వేతన ఒప్పందానికి సీఐటీయూనే గెలిపించండి

- Advertisement -

– సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
– రాణే బ్రేక్‌ లైనింగ్‌ పరిశ్రమ గేట్‌ మీటింగ్‌కు హాజరు
నవతెలంగాణ-గజ్వేల్‌

రాణే బ్రేక్‌ లైనింగ్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో నేడు జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో సీఐటీయూను భారీ మెజార్టీతో గెలిపించాలని.. మెరుగైన వేతన ఒప్పందం సీఐటీయూతోనే సాధ్యమని ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలంలోని రాణే పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో భాగంగా పరిశ్రమ గేట్‌ మీటింగ్‌ను యూనియన్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఐటీయూ.. కార్మికుల మెరుగైన జీవన ప్రమాణాల కోసం యజమాన్యలతో రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్నదన్నారు. గతంలో రూ.10,000 పైగా వేతన ఒప్పందం చేసి కార్మికుల కుటుంబాలకు మెరుగైన మెడికల్‌ పాలసీని, జీపీఏను అమలు చేసిందని తెలిపారు. కార్మికులు మరణించినప్పుడు వారి కుటుంబాలకు అండగా ఉండే విధంగా పథకాలు తయారుచేసి ఆదుకున్నట్టు చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు కోడ్‌లకు వ్యతిరేకంగా మే 20న సమ్మె చేస్తుంటే బీఎంఎస్‌ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నదన్నారు. పరిశ్రమ భద్రత, ఉద్యోగ భద్రతా ప్రమాణాలు, సంక్షేమ పథకాలను నూతన కోడ్‌లలో నిర్వీర్యం చేసిందన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో విభజించే కార్మికుల ఐక్యతను విచ్చినం చేసే బీఎంఎస్‌ను ఓడించాలని సీఐటీయూను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య, యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌, ఉప ప్రధాన కార్యదర్శి బండ్ల స్వామి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దువ్వల బిక్షపతి, యూనియన్‌ నాయకులు చంద్రశేఖర్‌ రెడ్డి, రవికుమార్‌, మల్లయ్య, నర్సింలు, రంగారెడ్డి, వివెంకట్రావు, ఏ.స్వామి, శ్రీనివాస్‌, సాజిద్‌, కృష్ణమూర్తి కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -