నవతెలంగాణ – కన్నాయిగూడెం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని సీఐటీయూ మండల కార్యదర్శి కావిరి సుధాకర్ (ఎస్ఎఫ్ఐ )జిల్లా కార్యదర్శి టి.ఎల్ రవి పిలుపునిచ్చారు. బుధవారం కన్నాయిగూడెం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కావిరి సుధాకర్. టి.ఎల్ రవి హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 129 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక చట్టాలు హక్కులను హరించారని ఆయన ఆరోపించారు. దీంతో కనీస వేతన చట్టం, సామాజిక భద్రత, సమ్మె చేసుకునే హక్కు, సంఘం పెట్టే హక్కు లేకుండా పోతుందని అన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని నీరు కార్చి వ్యవసాయ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుందని, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించాలని రైతు వ్యతిరేక చట్టాలు దొడ్డి దారిన తీసుకరావడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇది కార్మిక వర్గానికి భారత దేశ ప్రజలకి తీరని నష్టమని అన్నారు.ఈ నెల 12న దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోరం చిరంజీవి, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కర్నే లాజర్, కార్మిక సంఘం నాయకులు నంద, మహేష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.



