ఉస్మానియా యూనివర్సిటీ నుండి గుండెబోయిన విజయ్ కుమార్‌కు డాక్టరేట్
నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండలంలోని మల్కపేట గ్రామానికి చెందిన యువ శాస్త్రవేత్త గుండెబోయిన విజయ్ కుమార్ ఖగోళ శాస్త్రం (ఆస్ట్రానమీ) విభాగంలో పీహెచ్‌డీ పట్టా సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ప్రముఖ విద్యాసంస్థ అయిన ఉస్మానియా యూనివర్సిటీ లో ప్రొఫెసర్ డి. శాంతి ప్రియ మార్గదర్శకత్వంలో ఆయన తన పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
ఖగోళ శాస్త్ర రంగంలో ఆయన చేసిన పరిశోధనకు విశ్వవిద్యాలయ అధికారులు ప్రశంసలు తెలిపారు. చిన్న గ్రామం నుంచి ఉన్నత విద్యలో ప్రతిభ చూపుతూ పీహెచ్‌డీ సాధించడం యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. విజయ్ కుమార్ చదువులో చిన్నప్పటి నుంచే ప్రతిభ కనబరుస్తూ ఉన్నత విద్యను అభ్యసించారు. శాస్త్రంపై ఆసక్తితో ఖగోళ శాస్త్రాన్ని ఎంపిక చేసుకుని దీర్ఘకాలం పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా విజయ్ కుమార్‌కు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.
గ్రామానికి చెందిన యువకుడు దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ సాధించడం మల్కపేట గ్రామానికి గౌరవంగా భావిస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు.ఇలాగే మరిన్ని ఉన్నత విజయాలు సాధించి సమాజానికి సేవ చేయాలని గ్రామస్తులు విజయ్ కుమార్‌కు ఆకాంక్షలు వ్యక్తం చేశారు.



