అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
చేసిన అప్పులు తీర్చలేక జీవితం మీద విరక్తి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుబ్బాక మండలం పద్మశాలి గడ్డలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై బత్తుల మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం పద్మశాలి గడ్డకు చెందిన మ్యాదరి నాగభూషణం వయసు 55 సంవత్సరాలు, గ్రామంలో వ్యవసాయం చేస్తూ భార్య, ముగ్గురు పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో మూడేళ్ల కాలవ్యవధిలో ఇద్దరు పిల్లల వివాహాలు జరిపించడంతో పాటు, కుటుంబ అవసరాల కోసం కొంత అప్పులు చేశాడు. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తనలో తాను బాధపడేవాడు. శుక్రవారం గ్రామ శివారులోని వడ్డెర కాలనీ సమీపంలో ఉన్న చింతచెట్టు వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. వెంటనే గుర్తించిన స్థానికులు వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కొరకు దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి, అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు .అక్కడ వైద్యులు పరీక్షించి నాగభూషణం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శవ పరీక్ష నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుని భార్య దేవలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Spread the love