నవతెలంగాణ నిజామాబాద్
గొంతులో మటన్ ముక్క ఇరుక్కొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం తండాలో చోటు చేసుకుంది. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దులం తండాలో ఇటీవల జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ విగ్రహాల ప్రతిష్ఠాపన చేశారు. అనంతరం గ్రామస్థులు ఆదివారం తమ ఇండ్ల వద్ద విందు నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో తండాకు చెందిన ఫకీరా అనే వ్యక్తి కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పస్‌పల్లి తండాకు చెందిన మిత్రులను భోజనానికి ఆహ్వానించారు. అందరూ కలిసి రాత్రి భోజనం చేస్తుండగా.. తారాసింగ్ (48) అనే వ్యవసాయ కూలీ గొంతులో మటన్ ముక్క తట్టుకుంది. దీంతో అతను వాంతులు చేసుకుని అక్కడికక్కడే మృతిచెందారు. అతని భార్య యమునా బాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.