అర్థం చేసుకునే తత్వం లేకపోతే... ప్రేమించుకున్న జంటలైనా పెండ్లయ్యాక ఆలుమగలుగా సాగడం కష్టమే. అదే పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కూడా పరస్పర గౌరవం, పంచుకునే మనసు ఉంటే అన్యోన్యంగా కలకాలం కలిసి ఉంటారు. అలాగే భార్యాభర్తలంటే కేవలం ప్రేమను పంచుకోవడమే కాదు.. ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించడం, అర్థం చేసుకోవడం, అండగా నిలబడడం.. వంటివన్నీ దాంపత్య బంధాన్ని దృఢం చేసేవే! అయితే వీటికి కాస్త సరదా కూడా జోడిస్తే ఆ బంధంలోని మధురానుభూతి రెట్టింపవుతుంది. ఇలా మీ బంధం దృఢంగా మారాలంటే ఏం చేయాలో చెబుతున్నారు మానసిక నిపుణులు.
కెరియర్, వ్యక్తిగత విజయాలు.. పెండ్లికి ముందు వరకూ ప్రతి ఆలోచనా ‘నాది, నేను’ అనే పరిధిలోనే తిరుగుతుంది. ఒకే గూటికి చేరాక మాత్రం ఆ ‘నేను’ను పక్కనపెట్టి ‘మనం’ అనే భావనను పెంపొందించుకోవాలి. సినిమాలైనా, షాపింగైనా, చివరకు స్నేహితులను కలవడమైనా జీవిత భాగస్వామిని భాగం చేయడం అలవాటు చేసుకోవాలి. అలానే రోజంతా మీరు ఎంత బిజీగా ఉన్నా.. కాసేపైనా భాగస్వామి కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. కేవలం బాధ్యతలు, సమస్యలే కాదు.. రోజువారీ ఆసక్తులు, ముచ్చట్లు పంచుకున్నప్పుడే బంధం బలపడుతుంది.
ప్రత్యేక రోజులు అక్కర్లేదు...
మనసులోని ప్రేమను చెప్పడానికి పుట్టినరోజు, పెండ్లిరోజు, వాలెంటైన్స్ డే వంటి ప్రత్యేక సందర్భాల కోసమే వేచి చూడాల్సిన పనిలేదు. ప్రతి రోజూ, ప్రతి క్షణం మీ అనురాగాన్ని వ్యక్తపరచడానికి సరైన సందర్భమే. పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రేమగా ఓ చిన్న మెసేజ్, అకస్మాత్తుగా హగ్ చేసుకోవడం, చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడం... ఇవన్నీ బంధంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రతిదానికీ ప్రత్యేక సమయం కోసం వేచి చూస్తే.. ‘నన్ను పట్టించుకోవడం లేదు, నాపై ప్రేమ తగ్గింది’ అనే చిన్న చిన్న అపోహలకు దారితీసే ఆస్కారం ఉంది.
అర్థం చేసుకోవడమే అసలైన గిఫ్ట్
చుట్టుపక్కల వారి అలవాట్లు, స్నేహితుల అభిరుచులపై శ్రద్ధ చూపే మనం.. మనతోనే జీవించే భాగస్వామి ఆశలేంటి? ఇష్టాయిష్టాలేంటి? అని గమనిస్తున్నామా? అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎదుటివారి మనసును, భావోద్వేగాలను సరిగ్గా అర్థం చేసుకునే వాతావరణాన్ని ఇంట్లో సృష్టించాలి. ఒకరి ఆసక్తులు మరొకరికి స్పష్టంగా తెలిసినప్పుడు.. సందర్భానికి తగినట్లుగా నడుచుకోవడం తేలికవుతుంది. ఇది మనస్పర్థలకు ఆస్కారం లేకుండా చేస్తుంది. సహనం, భాగస్వామి నిర్ణయాలకు ఇచ్చే గౌరవం, చిన్న సర్దుబాట్లే మీ బంధాన్ని నూరేళ్లపాటు సంతోషంగా నిలబెడతాయి.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను...
ప్రేమికులే కాదు.. భార్యాభర్తలు కూడా చెప్పుకోవాల్సిన మాట ఇది. అయితే ఇలా చెప్పుకోకపోతే ప్రేమ లేదని కాదు.. అలాగని రోజూ చెప్పినా బోర్ కొడుతుంది కూడా! అందుకే అప్పుడప్పుడూ విభిన్న రీతుల్లో, వేర్వేరు భాషల్లో ఐలవ్యూ చెప్పడానికి ప్రయత్నించండి. ఇది ఇద్దరికీ సరదాను పంచుతుంది. ఇక పుట్టినరోజు, పెండ్లిరోజు.. వంటి ప్రత్యేక సందర్భాల్లో మీ భాగస్వామికి నచ్చిన మంచి కానుక కొని.. దాన్ని ఇస్తూ ఈ మాట చెబితే.. మరింత సర్ప్రైజింగ్గా ఉంటుంది.
కాసేపైనా నవ్వుకోండి..
ఓ నవ్వు జీవితంలోని బాధల్ని మరిపిస్తుంది. అలాగే దంపతుల మనసుల్ని కూడా మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి ఖాళీ సమయాల్లో దంపతులిద్దరూ కలిసినప్పుడు అనవసర విషయాలతో కాలక్షేపం చేయకుండా.. జోక్స్, నవ్వు తెప్పించే చిన్నప్పటి సంగతులు.. వంటివి పంచుకోవాలి. అలాగే ఉదయం లేదా సాయంత్రం ఇద్దరూ కలిసి కాసేపు అలా నడు స్తూ.. సరదాగా మాట్లాడుకోవడం మంచిది. అలాగే సమయం దొరికినప్పుడైనా ఇద్దరూ కలిసి తమకు నచ్చిన కామెడీ, రొమాంటిక్ సినిమాలు చూడడం అల వాటు చేసుకోవాలి. ఇలా వీలైనప్పుడల్లా దంపతులి ద్దరూ కలిసి సరదాగా గడపడం వల్ల వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
నచ్చేలా.. మెచ్చేలా!
మెరుగైన సౌకర్యాలు, సమానత్వం, బాధ్యతలు... కారణాలేవైతేనేం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న రోజులివి. పని, కాల్స్ మధ్య రోజులైతే గడిచిపోతున్నాయి. ‘ఇంటికెప్పుడొస్తావ్?’, ‘ఈ పూటకి ఆర్డర్ పెట్టేసుకుందామా?’ వంటి అత్యవసర మెసేజ్‌లు తప్ప ప్రేమకు తావేది? దీంతో దంపతుల మధ్య కనిపించని దూరం. చివరికి వెనక్కి చూసుకుంటే ఎదురయ్యేది నిరాశే! ఆ పరిస్థితి రావొద్దంటే.. కనీసం సెలవు రోజునో.. అలా బయటకు వెళ్లినప్పుడో.. లేదంటే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాలప్పుడో.. ఒకరికొకరు ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా రెడీ కావాలి. అక్కడితో ఆగిపోకుండా.. ఆ క్షణం మీ భాగస్వామిపై మీకున్న ఫీలింగ్‌ని వారితో చెప్పేయాలి. మీ మనసులోని భావాల్ని రొమాంటిక్‌గా వ్యక్తం చేయాలి.. దీనివల్ల ఇద్దరి మధ్య ప్రేమ హద్దులు దాటుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు.
డీకోడ్లు వద్దు...
మీ ప్రత్యేకతేంటి? ఉదయాన్నే కలిసి కాఫీ తాగాలి. అల్పాహారం తినాలి. మధ్యలో ఒక్కసారైనా కాల్ చేసుకుని పలకరించుకోవాలి... ఇలా మీకే పరిమితమైన నియమమేమైనా ఉందా? లేదంటే రూపొందించుకోండి. ఇది మిమ్మల్ని మీ బిజీ షెడ్యూళ్లకు అతీతంగా కలిపి ఉంచడంలో సాయపడుతుంది. అలాగే ‘చిరాకులో ఉన్నారు... కాసేపు మౌనంగా ఉందాం’ అనుకుంటారొకరు. ‘మూడ్ బాలేదు. కాసేపు తోడుగా కూర్చొని ఏదైనా మాట్లాడితే బాగుండు’ అనుకుంటారు ఇంకొకరు. ఎంత విరుద్ధ ఆలోచనలు. తీరా మనసు అర్థం చేసుకోరంటూ బాధపడుతుంటారు. మనసులోకి దూరి ఎవరు చూస్తారండీ? ఈ డీకోడింగ్లు లేకుండా నేరుగా మనసు విప్పేయండి. ఇద్దరికీ ఆనందం.
కపుల్టైమ్ కావాలి!
కలిసి ఉండేది ఒకే ఇంట్లో అయినా.. మీకంటూ ప్రత్యేక సమయం కావాలి. కాబట్టి, వారంలో లేదా నెలలో ఒకరోజు తప్పక కేటాయించుకోండి. క్యాలెండర్లో గుర్తుపెట్టుకుంటారో, ఫోన్లో రిమైండర్ పెట్టుకుంటారో.. సినిమా, పర్యటన, గుడి, లేదంటే ఇంటి దగ్గర్లో కలిసి నడవడమైనా సరే ప్లాన్ చేసుకోండి. అయితే వాయిదా వేయకుండా తప్పకుండా వెళ్లాలి. అనుకోని సెలవులు, ప్రయాణాలు.. పలకరించేవి చాలానే! ఇద్దరికీ కాసేపు సమయం దొరికిందా.. అప్పుడూ చెరో ఫోన్‌తో గడపొద్దు. నిజానికి దంపతులకు అవే విలువైన క్షణాలు. తినేటప్పుడు దొరికే సమయమైనా సరే! ఆలోచనలు పంచుకోవడానికో.. జ్ఞాపకాలు నెమరేసుకోవడానికో.. భవిష్యత్తు తీర్చిదిద్దుకోవడానికో కేటాయించుకోండి. పిచ్చాపాటీ అయినా సరదా ఆటైనా పర్లేదు కానీ కలిసే చేయండి.
కాస్త సమయం వెచ్చిస్తే చాలు
ఒకరికి సాయంత్రానికే విధులు పూర్తవుతాయి. మరొకరికి పది దాటితే కానీ కాల్స్ పూర్తికావు. అలాంటప్పుడు రోజూ కలిసే డిన్నర్ చేయాలన్న నియమం పెట్టుకుంటే కుదరదు. కాబట్టి ఎవరి రూల్స్నో పాటించక్కర్లేదు. మీకు వీలైందేదో చూసుకోండి. గంటలకొద్దీ కబుర్లు చెప్పుకోనక్కర్లేదు. కానీ రోజంతా ఎలా గడిచిందో ఒకరినొకరు కచ్చితంగా అడిగి తెలుసుకోండి. అలాగని సరకులు తెచ్చాను, వాళ్లని కలిశాను వంటివి కాదు. సంతోషం, బాధ ఏదైనా పంచుకోవాలి అనిపించిన వాటికే చోటివ్వాలి. ఇంకోటి.. అవతలివాళ్లు మాట్లాడుతుంటే ఫోన్ చూడటం లాంటివి చేయొద్దు. బిజీ అన్న కారణంతో బంధాన్ని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. రోజూ కాస్త సమయం వెచ్చిస్తే చాలు. ఉరుకుల పరుగుల జీవితాల్లోనూ ప్రేమగా జీవించొచ్చు.





కామెంట్లు (0)