వ్యవసాయంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తూ, తనకున్న ఆరు ఎకరాల భూమిలో విభిన్న పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, తిర్యాణి మండలం గీతమందిర్ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళా రైతు పెండూర్ లక్ష్మి బాయి. భర్త సహకారంతో వ్యవసాయ పనులు చేస్తూ, సేంద్రియ పద్ధతుల్లో పంటలను పండిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. గతంలో పత్తి వంటి పంటలను సాగు చేసిన ఆమెకు సరైన దిగుబడులు, గిట్టుబాటు ధరలు లభించకపోవడం, వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ నిరాశ చెందకుండా కష్టపడి పనిచేస్తూ వ్యవసాయంలో విభిన్న పద్ధతులను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో CPF సంస్థ అందించిన సహకారం, మార్గదర్శకత్వం ఆమెకు ఉపయోగపడ్డాయి.
లక్ష్మి బాయికి ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఒక ఎకరంలో మామిడి, జామ తోటను ఏర్పాటు చేసుకోగా, మిగిలిన ఐదు ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, కంది, వరి, టమాట, మిర్చి, గోబీ, పెసర, శనగ వంటి వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా ఆహార పంటలతో పాటు కూరగాయలను పండిస్తూ భూమిని సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు భూమి సారాన్ని కాపాడుకోవడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు వ్యవసాయం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న సహజ వనరులైన ఆవుపేడ, ఆవు మూత్రాన్ని ఉపయోగించుకుంటూ పంటలను సాగు చేస్తున్నారు. పంటల సాగు, మొక్కల సంరక్షణ, కలుపు తీయడం వంటి పనుల్లో భర్తతో కలిసి శ్రమిస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు.
విభిన్న పంటల సాగుతో ఆదాయం
మామిడి, జామ తోటతో పాటు కూరగాయలు, ఇతర పంటలను సాగు చేయడం వల్ల ఏడాది పొడవునా వ్యవసాయ పనులు కొనసాగించేందుకు అవకాశం ఏర్పడింది. వివిధ పంటలు, కూరగాయల సాగు ద్వారా ఏడాదికి సుమారు రూ.2 లక్షల ఆదాయం పొందుతున్నారు. మామిడి పండ్ల విక్రయం ద్వారా అదనంగా రూ.15 వేల ఆదాయం పొందారు. విభిన్న పంటల సాగు ద్వారా వ్యవసాయంపై ఆధారపడుతూ కుటుంబ అవసరాలను తిర్చుకుంటున్నారు.
మహిళా రైతులకు స్ఫూర్తి
లక్ష్మి బాయి అనుసరిస్తున్న వ్యవసాయ పద్ధతులను తెలుసుకునేందుకు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 50 మంది మహిళా రైతులు జిల్ల కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమె వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పంటల సాగు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సహజ వనరుల వినియోగం గురించి తెలుసుకున్నారు. ఆమె అనుభవాల ద్వారా సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంపొందించు కున్నారు. ఈ పద్ధతులను తమ గ్రామాల్లోని ఇతర రైతులకు కూడా పరిచయం చేసేందుకు అవకాశం ఏర్పడింది.
కష్టమే విజయానికి బాట
వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా భర్తతో కలిసి నిరంతరం శ్రమిస్తూ ముందుకు సాగుతున్న లక్ష్మి బాయి ప్రయాణం గ్రామీణ మహిళా రైతులకు స్ఫూర్తిదాయకం. తనకున్న భూమిలో విభిన్న పంటలను సాగు చేస్తూ, సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇస్తూ, తన అనుభవాలను ఇతర మహిళా రైతులతో పంచుకుంటున్నారు. కష్టపడి పనిచేస్తూ అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయాన్ని మెరుగ్గా కొనసాగించవచ్చని ఆమె ప్రయాణం తెలియజేస్తోంది.





కామెంట్లు (0)