నవతెలంగాణ-హైదరాబాద్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం ప్రదర్శించారు. క్యూ లైన్లో నిలబడిన రైతులపై మరికల్ ఎస్ఐ రాము జులుం ప్రదర్శించాడు. యూరియా కోసం క్యూ లైన్లలో నిలిచిన రైతులపై ఎస్ఐ చేయి చేసుకున్నాడు. యూరియా అడిగిన రైతును చెంప మీద కొట్టాడు. ఈ ఘటనతో రైతు షాక్ కు గురయ్యాడు. రైతులు, రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని.. యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా అడిగినందుకు రైతు చెంప ఛెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పాలన? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా..? అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు.
ఈ ముఖ్యమంత్రికి తెలిసిన విద్యలు రెండే.. మూటలు మోయడం.. మాటలు మార్చడం అని హరీశ్‌రావు విమర్శించారు. యూరియా విషయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా ఏం చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరతే లేదన్నారు.. ఏఐతో ఫేక్ ఫోటోలతో ప్రచారం అన్నారు. రాష్ట్రంలో రైతుల క్యూలైన్లే లేవన్నారు. తరువాత.. క్యూలో ఉన్నవాళ్లు రైతులే కాదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలే లైన్‌లో నిల్చున్నారన్నారు. చివరికి యూరియా కొరత నిజమేనని ఒప్పుకున్నారు కానీ కారణం మాది కాదు కేంద్రంలోని బీజేపీదన్నారు. రైతులపై చేయి చేసుకున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా చేయడంలో విఫలమైన ఈ సర్కారు యావత్ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు.