- Advertisement -
- రాష్ట్ర ప్రభుత్వర ఉపాది భద్రత కల్పించాలి : తెలంగాణ విశ్వకర్మ వృత్తిదారుల రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో విశ్వకర్మ వృత్తులను మార్వాడీలు కబలిస్తున్నారని తెలంగాణ విశ్వకర్మ వృత్తిదారుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. విశ్వకర్మలకు ఉపాది భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం కూరెళ్ళ నరసింహ చారి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు లెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృత్తిదారులను చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. మార్వాడీల నుంచి ఎదురౌతున్న పోటీని తట్టుకునేందుకు విశ్వకర్మ వృత్తిదారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి వచ్చే బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆధునిక యంత్ర పరికరా లను 90శాతం సబ్సిడీతో అందించాలనీ, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈఎస్‌ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలనీ, మరణిం చిన వృత్తిదారుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ వృత్తి దారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కుమారస్వామి, ఉపాధ్యక్షులు సుంకోజు యాదగిరిచారి. గుంటోజు భీష్మచారి, పోలోజు శ్రీహరి. తాటోజు రవీంద్రాచారి, మెరుగోజు.సత్యనారాయణ చారి, శ్రీరామోజు ఆంజనేయులు చారి, వెలమలపల్లి వెంకటాచారి, శానగోండ వెంకటాచారి, కోటేశ్వరచారి, బ్రహ్మచారి, జగదీశ్వర చారి తదితరులు పాల్గొన్నారు
- Advertisement -