– యూటీఎఫ్ వ్యవస్థాపకులు రావెళ్ల రాఘవయ్య సంస్మరణ సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
– ఆదర్శప్రాయుడు రాఘవయ్య : టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
సమస్త మానవాళి సమస్యలకు ఏకైక పరిష్కారం మార్క్సిజం మాత్రమేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. మార్క్సిజం కోసం రాఘవయ్య తుదికంటా పోరాడారని తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని శ్రీనివాసనగర్‌లో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు షేక్ రంజాన్ అధ్యక్షతన నిర్వహించిన యూటీఎఫ్ వ్యవస్థాపకులు రావెళ్ల రాఘవయ్య సంస్మరణ సభలో తమ్మినేని మాట్లాడారు. ప్రపంచంలో ఏ సమస్యకైనా మార్క్సిజం మాత్రమే సమాధానం వెతికిందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపటం కోసం రాఘవయ్య కృషి చేశారని తెలిపారు. వేలమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు యూటీఎఫ్ వ్యవస్థాపకులుగా విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడారని రాఘవయ్య సేవలను కొనియాడారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో చరిత్రను వక్రీకరించే కుట్రలు చేస్తూ విద్యా కాషాయీకరణకు పాల్పడుతోందన్నారు. ఎన్‌ఈపీ పేరుతో విద్యారంగాన్ని బహుళ జాతి సంస్థలకు అప్పగిస్తుందన్నారు. ఉన్నత ఆదర్శాలను జీవితాంతం కొనసాగించిన మహానీయుడు రాఘవయ్య అని, ఆయనను ఆదర్శంగా తీసుకుని నేటితరం పనిచేయాలని పిలుపునిచ్చారు. రాఘవయ్య కుటుంబం మొత్తం వివిధ ప్రజాతంత్ర ఉద్యమాలకు అండగా నిలబడిందన్నారు. శ్రీనివాసనగర్‌లో గ్రంథాలయాన్ని నిర్మించి ప్రజలను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు పాత్ర పోషించారని తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని మాట్లాడుతూ.. సంఘం కోసం అనేక త్యాగాలు చేసిన ఆదర్శప్రాయుడు రావెళ్ల రాఘవయ్య అని చెప్పారు. అనేక నిర్భంధాలు ఎదుర్కొని సంఘాన్ని జిల్లాలో స్థాపించి, ఉపాధ్యాయులకు విశేషమైన సేవలను అందించారని వివరించారు. సంఘానికి విలువైన ఆస్తులనూ కూడబెట్టారిన తెలిపారు. ముందుగా రాఘవయ్య చిత్రపటం వద్ద నాయకులు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని. సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు వి.రాంబాబు, బి. రాందాస్, యం.నర్సయ్య, పి.సురేష్, వలీ, ఎన్.వీరబాబు, బి. నర్సింహారావు, జి.రాజశేఖర్, డి.శ్రీనివాస్, కె.కుటుంబరావు, కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు, వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మానవాళి సమస్యలకు ఏకైక పరిష్కారం మార్క్సిజం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES