– ఛత్తీస్‌గఢ్‌లో 14వేల మంది రిజైన్
– 25 మంది సిబ్బంది తొలగింపునకు నిరసనగా..
– కాంట్రాక్టు ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు
రారుపూయ్ : ఆందోళన చేస్తున్న 25మంది ఎన్‌హెచ్‌ఎం (నేషనల్ హెల్త్ మిషన్) సిబ్బందిని ప్రభుత్వం తొలగించడానికి నిరసనగా ఛత్తీస్‌గఢ్‌లో 14వేల మందికి పైగా ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఆఫీసర్లు, ఉద్యోగులు మూకుమ్మడిగా తమ రాజీనామాలు సమర్పించారని వారి ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. తమ డిమాండ్ల సాధన కోసం ఆగస్టు 18 నుంచి ఎన్‌హెచ్‌ఎం సిబ్బంది ఆందోళన చేస్తోన్నారు. తమ సర్వీసులను క్రమబద్ధీరించాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలని వారు కోరుతున్నారు. దీర్ఘకాలంగా నెరవేరని వారి డిమాండ్లను పరిష్కరించడానికి బదులుగా ప్రభుత్వం వారిపై కఠినమైన చర్యలు తీసుకుందని ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ ఎన్‌హెచ్‌ఎం కర్మచారి సంఫ్‌ు ఆఫీస్ బేరర్ వ్యాఖ్యానించారు. అందరికీ సమానమైన, అందుబాటులో ఉండే, నాణ్యతాపరమైన ఆరోగ్య సేవలను అందించే లక్ష్యంతో జాతీయ హెల్త్ మిషన్ ఏర్పాటైంది. ఈ ప్రోగ్రామ్ కింద విస్తృతస్థాయిలో డాక్టర్లు, నర్సులతో పాటూ ఆరోగ్య కార్యకర్తలు పనిచేస్తూంటారు. వీరి సమ్మెతో కీలకమైన పలు విభాగాల ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. టీకాలు వేయడం, నవజాత శిశు సంరక్షణ, ఫిజియోథెరపీ, జనన, మరణ ధృవీకరణపత్రాల జారీ, టీబీ మందుల పంపిణీ ఇలాంటివన్నీ స్తంభించాయని అధికారులు తెలిపారు.
కాంట్రాక్టు ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామాలు
- Advertisement -
- Advertisement -