నవతెలంగాణ డాకర్: పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు సృష్టించిన నరమేధంలో 100మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధిక సంఖ్యలో సైనికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక అధికారుల సమాచారం మేరకు.. బుర్కినా ఫాసోలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. ఉత్తర బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు పలు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఇందులో సైనిక స్థావరంతో పాటు డజిబో పట్టణం సైతం ఉంది. బుర్కినా ఫాసో సహెల్ ప్రాంతంలో తీవ్రవాదం పేట్రేగిపోతున్న సమయంలో అక్కడ యాక్టివ్గా ఉన్న అల్ ఖైదా అనుబంధ గ్రూప్ జేఎన్ఐఎమ్ ఈ దాడికి పాల్పడింది.
ఏక కాలంలో ఎనిమిది ప్రాంతాల్లో దాడులు
జేఎన్ఐఎమ్ ముష్కరులు ఎనిమిది ప్రాంతాల్లో ఒకేసారి దాడులు జరిపినట్లు ఓ సహాయ కార్యకర్త తెలిపారు. ముష్కరులు బుర్కినా ఫాసో ఎయిర్పోర్టును ధ్వంసం చేసే లక్ష్యంతో ఈ దాడికి తెగబడ్డారు. ముందుగా డజిబో నగరంలోకి ప్రవేశించే దారుల్ని నిర్బందించారు. అనంతరం సైనిక శిబిరాలపై దాడి చేశారు. స్పెషల్ యాంటీ టెర్రరిజం యూనిట్ శిబిరాల్లో బీభత్సం సృష్టించారని చెప్పారు.