నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యాను భారీ భూకంపం కుదిపివేసింది. రష్యా తూర్పు తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌క తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత 8.0గా రిక్టర్ స్కేలుపై తొలుత నమోదైందని అమెరికా జాతీయ సునామీ కేంద్రం తెలిపింది. తర్వాత దాన్ని 8.7గా సవరించింది. ఈ భూకంపం కారణంగా రష్యాలోని కంచట్కా ప్రాంతంలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
కంచట్కాలో వచ్చిన భూకంపం నేపథ్యంలో అమెరికా, జపాన్ తదితర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలస్కా, హవాయి ద్వీపాలను కలుపుకుని పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఒక మీటర్ ఎత్తులో సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ కేంద్రం తొలుత హెచ్చరించింది. తర్వాత దాన్ని మూడు మీటర్లుగా సవరించింది. పలుమార్లు సునామీలు వచ్చే అవకాశం ఉందని.. హెచ్చరికలు ఎత్తివేసే వరకు సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించింది.