Tuesday, April 29, 2025
Navatelangana
Homeజాతీయంకర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

- Advertisement -

– 38 మంది హతం?
– అధికారికంగా రావాల్సిన స్పష్టత
– తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఘటన
– మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ
– గత కొన్నిరోజులుగా భద్రతా బలగాల భారీ కూంబింగ్‌
– ఛత్తీస్‌గఢ్‌ పోలీస్‌ అధికారులతో పాటు కేంద్ర బలగాల ఆపరేషన్‌
– మోస్ట్‌వాంటెడ్‌ హిడ్మా, ఇతర కీలక నేతలే టార్గెట్‌గా జల్లెడ
ఛత్తీస్‌గఢ్‌:
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. శనివారం ఉదయం జరిగిన ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. ఉదయం 28 మంది మావోయిస్టులు మతి చెందినట్టు… సాయంత్రం వరకు ఆ సంఖ్య 38కి చేరినట్టు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. దీనిపై అటు ప్రభుత్వం నుంచి కానీ, ఇటు అధికారుల నుంచి కానీ ఎలాంటి అధికారిక సమాచారమూ అందలేదు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పెద్ద ఎత్తున భద్రతా బలగాలు చేపట్టిన భారీ కూంబింగ్‌ ఆపరేషన్‌ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నది. గత కొన్ని రోజులుగా కేంద్ర బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇదివరకే ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం అందగా.. శనివారం నాడు ఆ సంఖ్య 38కి చేరినట్టు తెలుస్తోంది.
మోస్ట్‌వాంటెడ్‌ హిడ్మా టార్గెట్‌గా..
కేంద్ర పారామిలటరీ బలగాల నేతృత్వంలో కర్రెగుట్టల్లో గత కొన్ని రోజుల నుంచి కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఏరియల్‌ సర్వే ద్వారా ఎప్పటికప్పుడు బలగాలకు సమాచారం అందుతోంది. మావోయిస్టు మోస్ట్‌ వాంటెడ్‌ అయిన హిడ్మా, దేవ టార్గెట్‌గా కూంబింగ్‌ కొనసాగుతున్నట్టు సమాచారం. వేల సంఖ్యలో బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయనీ, మావోయిస్టులను రౌండప్‌ చేశాయని శుక్ర వారం ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కర్రెగుట్టల్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం అందింది. ఈ వార్తే నిజమైతే మావోయిస్టులకు ఇది మరో పెద్దదెబ్బ అని విశ్లేషకులు చెప్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఛత్తీస్‌గఢ్‌లోని అడవులు కాల్పుల మోతతో దద్దరిల్లుతున్నాయి. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. ఇందులో భాగంగా మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు ప్రత్యేక దృష్టిని సారించాయి. కూంబింగ్‌ చేపట్టి మావోయిస్టులను ఏరివేస్తున్నాయి. దీంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకోవటం, మావోయిస్టులు హతమవుతున్న ఘటనలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. అడవుల్లో ఎన్‌కౌంటర్‌ ఘటనలతో అక్కడి గిరిజనులు వణికిపోతున్నారు. ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో వారు ఉంటున్నారు.
అణువణువూ జల్లెడ
పూజారికాంకేర్‌, గంజపర్తి, నంబి, భీమవరంపాడు, కస్తూరిపాడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్ట అడవుల్లో భద్రతా బలగాల కూంబింగ్‌ ఐదోరోజు కొనసాగింది. శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న వాజేడు ఏజెన్సీ, వెంకటాపురం ప్రాంతాలను భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకుని సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగించాయి. గతంలో ఈ కర్రెగుట్టపైకి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా భద్రతా బలగాలు వ్యూహం మార్చాయి. ఒకవైపు నుంచి కాకుండా మొత్తం నాలుగువైపుల నుంచి చుట్టుముట్టి, కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టి ఒక్కో ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ ముందుకు సాగాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు కర్రెగుట్టలను అన్నివైపులా నుంచి చుట్టుముట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. సిబ్బందికి కావాల్సిన ఆహారం, తాగునీరు, ఎమర్జెన్సీ ఐటమ్స్‌ ఎప్పటికప్పుడు వారికి మరో టీమ్‌ చేరవేసింది. మావోయిస్టులు మరో ప్రాంతానికి వెళ్లేందుకు అవకాశం లేకుండా అన్నివైపుల నుంచి వారిని చుట్టుముట్టి మట్టుబెట్టారు. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ప్రాథమికంగా 28 మంది వరకు మావోయిస్టులు చనిపోయారని తెలిసినా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఏడాది ఇదివరకే వందల మంది మావోయిస్టులు భద్రతా బలగాల కాల్పుల్లో మరణించారు.
కాల్పుల మోతలతో దద్దరిల్లుతోన్న ఏజెన్సీ
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలు పోలీస్‌ బలగాలకు, మావోయిస్టులకు గత ఆరు రోజులుగా జరుగుతున్న ఎదురుకాల్పులతో రక్తమోడుతున్నాయి. కాల్పుల మోత, తుపాకుల తూటాల శబ్దాలతో ఏజెన్సీ ప్రాంతం అట్టుడుకుతోంది. ఈ ఆపరేషన్‌ వ్యవహారమంతా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ అధికారులతో పాటు కేంద్ర బలగాలు నిర్వహిస్తున్నాయి. కర్రెగుట్టల ప్రాంతాల్లో భద్రతా బలగాలు హెలికాప్టర్ల సహాయంతో అడవినంతా జల్లెడ పడుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా డ్రోన్ల సహాయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. భద్రతా బలగాలకు ఎనిమిది హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు, భోజనాలు, నీళ్ల సరఫరాను అందిస్తున్నారు. మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు ఏరియల్‌ సర్వే నిర్వహిస్తూ ఆచూకీని కనుగొంటున్నారు. ఎదురు కాల్పులకు సంబంధించిన ప్రతి విషయాన్ని భద్రతా బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా కేంద్రానికి తరలించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు