నవతెలంగాణ కాకినాడ: కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు చోటుచేసుకుంది. గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఘటనాస్థలిలో శరీరభాగాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రయివేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్టు సమాచారం. బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడం వల్లే ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.



