నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సోమవారం సాయంత్రం 6.55 గంటలకు పేలుడు సమాచారం అందినట్లు అగ్నిమాపక శాఖ ప్రకటించింది. ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
ఢిల్లీలో హైఅలర్ట్
పేలుడు నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్ ఘటనా స్థలికి చేరుకున్నాయి. ప్రమాదం అనంతరం స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కనే ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఎర్రకోట సమీపంలో భారీ పేలుడు.. 9మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



