నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతిచెందారు. బర్మింగ్‌హామ్ లోని అపార్ట్‌మెంట్ కంప్లెక్స్‌లో పదిమంది తెలుగు విద్యార్థులు నివసిస్తున్నట్లు సమాచారం. హఠాత్తుగా చెలరేగిన మంటలతో ఉక్కిరిబిక్కిరైనా విద్యార్థులు.. అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమైన కాసేపటిలోనే ఘాటైన పొగ వెలువడడంతో విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో కేకలు వేశారు. ప్రాణ భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొని వచ్చారు. ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హైదరాబాద్ చెందిన ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఉడుముల సహజ రెడ్డి, కూకట్ పల్లికి చెందిన మరొక విద్యార్థి ఉన్నట్లు సమాచారం. అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.



