నవతెలంగాణ – హైదరాబాద్ : దీపావళి పండుగ వేళ నవీ ముంబైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాషి సెక్టార్-14లోని రహేజా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది వరకు గాయపడినట్లు సమాచారం. రహేజా రెసిడెన్సీలోని 10వ అంతస్తులో తొలుత మంటలు చెలరేగాయి. అవి వేగంగా పైనున్న 11, 12 అంతస్తులకు కూడా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చినప్పటికీ, అప్పటికే నలుగురు మృతి చెందారు.
మృతులను వేదిక సుందర్ బాలకృష్ణన్ (6), ఆమె తండ్రి సుందర్ బాలకృష్ణన్ (44), కమలా హీరాలాల్ జైన్ (84), పూజా రాజన్ (39)గా గుర్తించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండుగ రోజు జరిగిన ఈ దుర్ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు, నిన్న ఉదయం ముంబైలోని కఫే పరేడ్ ప్రాంతంలో జరిగిన మరో అగ్నిప్రమాదంలో 15 ఏళ్ల బాలుడు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఎలక్ట్రిక్ వైరింగ్, ఈవీ బ్యాటరీల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కేవలం 20 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చినట్లు వారు వెల్లడించారు.